గ్రీన్ మ్యాట్లా.. ఇది మరీ విడ్డూరం

సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు కొంత కాలంగా ఊదరగొట్టేస్తున్నారు. ఆ పేరుతో సభలు నిర్వహించడంతో పాటు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐతే ‘సిద్ధం’ సభలన్నీ జగన్ జన బలాన్ని చూపించే లక్ష్యంతోనే సాగుతున్నాయి.

తొలి సభకు 3 లక్షల మంది హాజరైతే.. రెండో సభకు 6 లక్షల మంది వచ్చారన్నారు. మూడో సభకు 10 లక్షల టార్గెట్ పెట్టారు. లేటెస్ట్‌గా అద్దంకిలో నిర్వహించిన సిద్ధం నాలుగో సభ టార్గెట్ 15 లక్షలు. ఎప్పుడైనా ఒక సభ పూర్తయిన తర్వాత దానికి ఇంతమంది వచ్చారు అని ప్రకటిస్తారు. కానీ సభకు చాలా రోజుల ముందే 15 లక్షల మంది వస్తున్నట్లు ప్రకటించడం అనూహ్యం. అంతమందిని ఒక చోటికి తీసుకొచ్చి సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. వేర్వేరు జిల్లాల్లో పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టి.. జనాలకు డబ్బులిచ్చి రప్పిస్తే తప్ప ఇలా జనం సభలకు రావడం కష్టం.

ఐతే ఎలా రప్పించారన్నది పక్కన పెడితే ‘సిద్ధం’ అద్దంకి సభకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్లో అయితే భారీగా జనం కనిపించారు. కానీ నిజంగా ఆ సభకు అంతమంది జనం వచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. విడ్డూరంగా ఒక రాజకీయ సభకు సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఫేక్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. భారీగా జనం ఉన్న ఫొటోలను జూమ్ చేసి చూస్తే.. ఒక రకం జన సమూహం.. వేర్వేరు చోట్ల ఉండడం గమనించవచ్చు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, నిజ నిర్ధారణ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలను ఎడిట్ చేసి జనంతో ప్రాంగణాన్ని నింపేసిన విషక్ష్ం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ సభ జరిపిన ప్రదేశాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్లతో నింపేయడంపై ముందే చర్చ జరిగింది. జనం పలుచగా అనిపిస్తే.. ఫొటో షాప్ వాడి ఆ ఖాళీల్ని నింపేయడానికే గ్రీన్ మ్యాట్స్ వేయించారని ప్రతిపక్షాలు ముందే ఆరోపించాయి. ఇప్పుడు చూస్తే ఆ సభలో అంతమంది జనం ఉండటం నిజం కాదనే అభిప్రాయం కలిగేలా ఫొటోల మార్ఫింగ్ జరిగిన విషయం బయటపడిపోయింది.