ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక్కడ మొత్తంలో అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయబోతున్నాడన్న విషయమే. ఐతే గత ఎన్నికల్లో కూడా జనసేనాని రెండు చోట్ల పోటీ చేశాడు. ఓడిపోయాడు.
ఈసారి కూడా రెండు సీట్లలో పోటీ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. పొత్తులో సీట్ల సర్దుబాటు కష్టంగా ఉన్న నేపథ్యంలో అలా జరగదనే అనుకున్నారు. ఐతే ఇప్పుడు రెండు చోట్ల పోటీ గురించి జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.
కానీ ఇక్కడ ఇంకో మలుపు ఏంటంటే.. పవన్ పోటీ చేసేది రెండు అసెంబ్లీ స్థానాల్లో కాదట. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానానికట. ఇప్పటికే ఖరారైన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటాడట.
జనసేనకు మంచి ఊపుందని భావిస్తున్న నేపథ్యంలో పవన్ రెండు చోట్లా జయకేతనం ఎగురవేస్తాడని కూటమి భావిస్తోంది. రెండు చోట్లా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే అభ్యర్థిని గెలిపించుకుంటారని.. తర్వాత పవన్ ఎన్డీయేలో చేరి కేంద్ర మంత్రి కూడా అవుతాడని జనసేన వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ అసెంబ్లీకి వెళ్లి జగన్‌ను ఎదుర్కోవడమే కరెక్ట్ అంటున్నారు.
ఎంపీ పదవికి ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో భాగం కావాలని అనుకుంటే.. ఎన్నికల తర్వాత అన్నీ చూసుకుని రాజ్యసభ సభ్యత్వం తీసుకుని మంత్రి కావాలనుకుంటే కావచ్చు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడం అన్నది చిత్రంగా అనిపిస్తోంది. అదే సమయంలో రెండు చోట్లా గెలిస్తే ఆయనది అరుదైన విజయం అవుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates