ఉమ్మడి ప్రకాశంలో బలమైన నేతలుగా ఉన్న ఆమంచి సోదరుల రాజకీయం టికెట్ల చుట్టూ తిరుగుతోంది. చీరాల నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమంచి తెలిపారు. చీరాల ఇంచార్జ్ గా మాత్రమే రాజీనామా చేశానని జనసేన రాష్ట్ర కార్యదర్శిగా మాత్రం కొనసాగుతానని ప్రకటన చేశారు. ఆమంచి రాజీనామాకు కారణం అసంతృప్తి కాదని.. దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు నిర్ణయించారు. కానీ, ఈ సీటును టీడీపీ తనదగ్గరే పెట్టుకుంది.
పొత్తులో భాగంగా ఉమ్మడి ప్రకాశంలోని గిద్దలూరు సీటు మాత్రమే జనసేనకు వచ్చింది. దీంతో గిద్దలూరు టికెట్ కోసం ఆమంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చీరాల బాధ్యతల నుంచి ఆమంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఆది నుంచి కూడా ఆమంచి సోదరుల చూపు చీరాల మీదే ఉంది. చీరాలలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు పోటీ చేయడం ఇష్టం లేదు. గతంలో టీడీపీలో ఉండే ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో వైసీపీ ఆమంచిని పక్కన పెట్టి కరణానికే ప్రాధాన్యం ఇచ్చింది. నియోజ కవర్గంలో జోక్యం చేసుకోవద్నది ఆమంచికి చెప్పి.. .. పర్చూరుకు పంపారు. అక్కడ కుదురుకునే పరిస్థితి లేదని తేలడంతో ఆయన చీరాలపైనే దృష్టిపెట్టారు. వైసీపీ టిక్కెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు.. తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని కృష్ణ మోహన్ నిర్ణయించారు. ఇటీవల చీరాలలో ఆయన అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
పర్చూరులోనే పోటీ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినకపోవడంతో సీఎం జగన్ కొత్త అభ్యర్థిని చూసుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత. ఆయనను సీఎం జగన్ వదులుకోరని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. చీరాలలో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తారని అంటున్నారు. చీరాలలో కరణం బలరాం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేయాలనుకుంటున్నారు. వారిని కాదని ఆమంచికి ఇస్తారా అన్న సందేహం ఉంది.
వైసీపీలో టిక్కెట్ రాకపోతే ఆమంచి జనసేన పార్టీలో అయినా చేరి పోటీ చేయాలనుకుంటున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆమంచి ఏం చేయబోతున్నారన్నది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది. ఆయన పార్టీ మారినా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వైసీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఎలా చూసినా.. ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉంటారని అంటున్నారు. అందుకే చీరాల రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates