అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ…కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలను వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారని, అందుకే జగనన్న ఫోటో ప్రచురించడానికి కాదేది అనర్హం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఫల్లీ చిక్కీ కవర్ మొదలు పొలం పట్టాదారు పాస్ బుక్ వరకు జగనన్న ఫోటోలు ముద్రిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై లోక్ సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరిందని, ఆఖరికి డెత్ సర్టిఫికెట్ పై సీఎం జగన్ ఫోటో వేసుకోవడం ఏంటని జేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు సర్వే రాళ్లపై కూడా జగన్ ఫోటోలు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదని అసహనం వ్యక్తం చేశారు. అంతా కలిసి సమాజాన్ని దరిద్రంగా తయారు చేశారని, ఇటువంటి కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని జేపీ అభిప్రాయపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాధనంతో ప్రచారం చేస్తున్న సమయంలో ఫోటోలు, పేర్లు ఉండకూడదని కోర్టు చెప్పిందని, కానీ, అందులో ప్రధాన మంత్రికి, ప్రధాన న్యాయమూర్తికి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, వారిద్దరికీ మాత్రం మినహాయింపు ఎందుకు అని జేపీ ప్రశ్నించారు. దానివల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. సమాజంలో ఈ జుగుప్సాకరమైన సంస్కృతి పెరిగిపోయిందని, ప్రతి దాంట్లో నేను అనే అహం పెరిగిపోవడం విచారకరమని అన్నారు. ఇటువంటి వ్యవహారాలపై ప్రజా వ్యతిరేకత రావాలని, ఇప్పుడిప్పుడే కుటుంబ పాలనపై కాస్త ప్రజావ్యతిరేకత మొదలైందని, అది శుభ పరిణామమని చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates