వైసీపీ ప్రభుత్వం, అధికారులు తమపై పెడుతున్న కేసులు, నమోదు చేస్తున్న ఎఫ్ ఐఆర్‌లపై టీడీపీ యువ నాయకుడు , మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. “మీ ఎఫ్ ఐఆర్‌లు మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి” అని నారా లోకేష్ అన్నారు. అంతేకాదు.. “బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా… బీసీ అంటే బలహీనవర్గం కాదు… బలమైన వర్గం” అని అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేష్ ప్రసంగించారు. రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు.
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి, పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని నారా లోకేష్ తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు.
“బీసీల కోసం ఏకంగా మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా టీడీపీ తీర్మానం చేసింది. కానీ ఈ సైకో(జగన్) ముఖ్యమంత్రి అయ్యాక బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఆనాడు బీసీలే వెన్నెముక అన్న వ్యక్తి ఇవాళ బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందికి పదవులు దూరం చేశాడు. ఇవాళ బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను వెనక్కి తీసుకున్నారు. ఆదరణ పథకం కూడా రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కోసం బీసీ సోదరులు 10 శాతం డబ్బు కడితే, ఆ డబ్బు నేడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు” అని విరుచుకుపడ్డారు.
బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారని, కానీ ఆ కార్పొరేషన్ల చైర్మన్లకు కుర్చీలు కానీ, టేబుళ్లు కానీ ఉన్నాయా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. రూ.75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని లోకేష్ మండిపడ్డారు. ఈ సైకో జగన్ జీవో నెం.217 తీసుకువచ్చి మత్స్యకారులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 300 మంది బీసీలను చంపేశారని మండిపడ్డారు. 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు.
“మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అని కూడా చూడకుండా.. యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఆయనపై ఏకంగా రేప్ కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడిపైనా కేసులు పెట్టారు. నిన్న గాక మొన్న నంద్యాల టీడీపీ అధ్యక్షుడిగా రాజశేఖర్ ను నియమిస్తే, ఆ బీసీ నాయకుడిపై ఈ ప్రభుత్వం రౌడీషీట్ తెరిచింది. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెబుతున్నా… మీరు పెట్టే ఎఫ్ఐఆర్ లను మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. రెండే రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి… జాగ్రత్త!” అని నారా లోకేష్ హెచ్చరించారు.