అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు పెరిగిపోతున్నట్లుంది. ఎంఎల్ఏ తిప్పేస్వామిని కాదని జగన్మోహన్ రెడ్డి కొత్త నేతను సమన్వయకర్తగా నియమించారు. సమన్వయకర్త, ఇన్చార్జి పేరేదైనా చివరకు అభ్యర్ధనే అర్ధమొస్తుంది. అందుకనే జగన్ ప్రకటించిన ఈరల కృష్ణనే అందరు అభ్యర్థిగా అనుకుంటున్నారు. అయితే సమస్యంతా ఇక్కడే వస్తోంది. ఎలాగంటే ఈరల కృష్ణ అభ్యర్ధిత్వాన్ని ఎంఎల్ఏతో పాటు ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువభాగం ఎంఎల్ఏకి బదులు కృష్ణే పార్టిసిపేట్ చేస్తున్నారు.
నిజానికి కృష్ణ అభ్యర్ధిత్వాన్ని నియోజకవర్గంలోని స్ధానిక సంస్ధల్లోని మెజారిటీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించి పంపారు. కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేసుకున్న జగన్ తన బృందాలతో సర్వే చేయించుకున్నారు. తిప్పేస్వామికన్నా కృష్ణకే గెలుపు అవకాశాలు చాలా ఎక్కువున్నట్లు ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఒకటికి రెండుసార్లు సర్వే రిపోర్టులను చెక్ చేసుకుని జిల్లా ఇన్చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడిన తర్వాతే ఈరలను జగన్ సమన్వయకర్తగా ప్రకటించారు. ప్రకటించినపుడు ఏమీ మాట్లాడిన తిప్పేస్వామి మద్దతుదారులు ఇపుడు గోలచేస్తున్నారు.
తిప్పేస్వామికి సమన్వయకర్తకు మధ్య సమన్వయం కుదర్చాల్సిన కీలక నేతలు కూడా పట్టించుకోవడం లేదు. దాంతో ఎంఎల్ఏ మద్దతుదారుల నుండి కృష్ణకు సహాయనిరాకరణ పెరిగిపోతోంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఎంఎల్ఏ లేకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. గతనెలలో జరిగిన ఆసరా పంపిణీ కార్యక్రమం తిప్పేస్వామి చేతుల మీదగా కాకుండా సమన్వయకర్త చేతుల మీదుగానే జరిగిపోయింది. అధికారులు కూడా ఈరలకృష్ణకే ప్రధాన్యతిస్తున్నారు. ఈ విషయం పార్టీలో బాగా చర్చనీయాంశమవుతోంది. ఒకసారి అవుట్ గోయింగ్ ఎంఎల్ఏ అని తెలిసిన తర్వాత ఏ నియోజకవర్గంలో అయినా ఎంఎల్ఏ పరిస్ధితి ఇలాగే ఉంటుంది.
అందుకు మడకశిర నియోజకవర్గం కూడా మినహాయింపు కాదు. కాకపోతే ఇపుడు ప్రకటించిన సమన్వయ కర్తలే రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులు గా ఉంటారని గ్యారెంటీ లేదు. చివరి నిముషంలో సమన్వయకర్త మారిపోయి సిట్టింగ్ ఎంఎల్ఏకే మళ్ళీ టికెట్ దక్కే అవకాశాలను కొట్టి పారేయలేము. అప్పుడు అధికారులకు, పార్టీలోని ప్రత్యర్ధి వర్గానికి సమస్యలు మొదలవుతాయి. మరి మడకశిర నియోజకవర్గంలో చివరకు ఏమవుతుంది ? ఎవరు అభ్యర్థిగా పోటీ చేస్తారనే విషయం సస్పెన్సుగా మారిపోయింది.