ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీ రావుతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు.
రాష్ట్రం, దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, వచ్చే పార్లమెంటు ఎన్నికలపై కూడా వీరు చర్చించినట్టు తెలిసింది. గత పదేళ్ల కాలంలో రామోజీరావు.. మాజీ సీఎం కేసీఆర్‌కు సానుకూలంగా వ్యవహరించారనే చర్చ ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనూ.. దీనికి ముందు కొత్త సచివాలయం ప్రారంభంలోనూ రామోజీరావు.. కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి సీఎం గా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆయన రామోజీని కలవడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దానిపై కూడా వీరు చర్చించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇక, ఈ భేటీలో సీఎం వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ కూడా ఉన్నారు.