గ్రేటర్ పరిధి పెరగబోతోందా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ప్రభుత్వం పెంచబోతోందా ? ప్రభుత్వ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోయే ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం లేదా లీకులు ఇవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమనే విషయంపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గ్రేటర్ చుట్టుపక్కలున్న 30 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను కూడా కలిపేస్తే గ్రేటర్ పరిధి మరింత విస్తృతమవుతుందని అనుకుంటున్నది.

ఇదే విషయమై చర్చించేందుకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలు అన్నింటిపైనా అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వమని ఆదేశించారట. ఇపుడు డెవలప్మెంట్ ను తీసుకుంటే గ్రేటర్ పరిధిలో ఒక విధంగాను శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో మరోరకంగానే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీలు డెవలప్ అయినంత స్పీడుగా శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు కావటంలేదు. కాబట్టి శివారుప్రాంతాల్లోని మున్సిపాలిటీలను కూడా కలిపేస్తే అభివృద్ధి ఒక్కసారిగా జోరందుకుంటుందని రేవంత్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇక్కడొక హిడెన్ కారణం కూడా ఉంది. అదేమిటంటే శివారుప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్సులు, నీటి పన్నులు తక్కువగా ఉంటాయి. అలాగే ఇళ్ళ నిర్మాణాలు, కమర్షియల్, అపార్టమెంట్లకు వసూలు చేస్తున్న వివిధ రకాల పీజులు కూడా తక్కువగానే ఉంటాయి. అదే గ్రేటర్ పరిధిలోని ట్యాక్సులు, వసూలుచేస్తున్న పీజులు, వాటర్ బిల్లులు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవటం చాలా అవసరం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలుకు ఏడాదికి రు. 1.43 లక్షల కోట్లు కావాలి. కాని ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. అందుకనే మొన్నటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించింది కేవలం రు. 53 వేల కోట్లుమాత్రమే.

కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ప్రభుత్వం పన్నులను పెంచే విషయాన్ని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిని పెంచే విషయాన్ని ఆలోచిస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలో ఇపుడు 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. వీటన్నింటినీ కూడా గ్రేటర్లో కలిపేసి గ్రేటర్ సిటీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలా ? లేకపోతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్నే నాలుగు కార్పొరేషన్లుగా చేయాలా అన్న చర్చలు జరిగాయట. అందుకనే దీనిపైన డీటైల్డ్ గా రిపోర్టు సబ్మిట్ చేయమని ఆదేశించింది.