విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. తనదైన శైలిలో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇక్కడి టికెట్‌ను టీడీపీ-జనసేన మిత్రపక్షంలో భాగంగా జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయంపై ఇంకా అదికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే.. దీనిపై ఇంకా ప్రకటన రాకముందే.. జలీల్ ఖాన్.. తనదైన శైలిలో మారాం మొదలు పెట్టారు.
మైనారిటీలు తననే కోరుకుంటున్నారని, తనకు ఇవ్వకపోతే.. ఉరేసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు.. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కేశినేని చిన్నిరంగంలోకి దిగి గురువారం ఉదయాన్నే(రెండు రోజుల కిందట కూడా.. తెల్లవారు జామునే ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు) జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆయన మెత్తబడక పోవడంతో పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ దగ్గరకు తీసుకువెళ్లారు.
దీంతో భవిష్యత్తును తాను చూసుకుంటానని.. పార్టీ గెలుపుకోసం ప్రయత్నం చేయాలనినారా లోకేష్ తేల్చి చెప్పారు. దీనికి సరేనని.. తలూపి వచ్చేసిన జలీల్‌ఖాన్.. సాయంత్రానికి ప్లేట్ ఫిరాయించారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత.. ఆయన వైసీపీకి టచ్‌లోకి వెళ్లిపోయారు. అత్యంత రహస్యంగా మీడియా కంట పడకుండా.. ఆయన తాడేపల్లికి వెళ్లి.. కీలకనేతలతో చర్చలుజరిపారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆయనకు దాదాపు హామీ లభించింది.
దీంతో జలీల్ ఖాన్ ఇంటికి ఉన్న టీడీపీ జెండాను వెంటనే తీసేయడం గమనార్హం. అత్యంత చాకచక్యంగా జలీల్ ఖాన్.. వ్యవహరించిన తీరు మాత్రం మీడియాకు తెలిసిపోయింది. అయితే.. తాను వేరే విషయంపై వెళ్లానని, టికెట్ కోసం కాదని.. అయినా.. టికెట్ ఇస్తే.. గెలుస్తానని.. 30 వేలపైగా మెజారిటీ తనకు వస్తుందని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ మౌనం దాల్చింది.
ఇప్పటికి నాలుగు సార్లు చెప్పిచూసినా.. జలీల్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ కావడం రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. దాదాపు ఆయన వైసీపీలో చేరిక ఖాయమైపోయిందని అంటున్నారు. ఇదిలావుంటే.. వైసీపీ ఇక్కడి టికెట్‌ను స్థానిక కార్పొరేటర్‌కు ప్రకటించింది. అయితే.. ఆయనకు ఎమ్మెల్యే స్థాయి లేకపోవడం అంతర్మథనంలో పడింది. 2014లో వైసీపీ తరఫున ఇక్కడ జలీల్‌ఖాన్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే.