నిన్నటి ‘జెండా’ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనేక మంచి విషయాలు చెప్పాడు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. వాటన్నింటినీ దాటి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న కామెంట్.. జగన్‌ను తన నాలుగో పెళ్లాం అనడం. జనసేనాని మీద విమర్శలు గుప్పించడానికి జగన్ సహ వైసీపీ వాళ్లందరూ ఎప్పుడూ వాడే అస్త్రం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారమే. అంటే ప్యాకేజ్ స్టార్ అంటారు. లేదంటే ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడతారు.
పవన్ ఎప్పుడూ పాలసీల గురించి మాట్లాడితే.. వైసీపీ వాళ్లు మాత్రం ఆయన పెళ్లిళ్ల వ్యవహారాన్ని లేవనెత్తడం విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జనాలకు, రాష్ట్రానికి ఏం నష్టం అంటే మాత్రం సమాధానం ఉండదు. గత ఏడాది కాలంలో జగన్ ఏ సభలో పాల్గొన్నా పవన్ పెళ్లిళ్ల వ్యవహారమే మాట్లాడుతున్నాడు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. స్కూల్ పిల్లలతో నిర్వహించిన సభలోనూ ఇదే టాపిక్ మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఐతే తన వ్యక్తిగత జీవితంపై ఎన్నిసార్లు దాడి చేసినా ఓపిక పడుతూ వచ్చిన జనసేనాని.. బుధవారం నిర్వహించిన ‘జెండా’ సభలో మాత్రం హద్దులు దాటేశాడు. తనకు జరిగింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకోటి కలిపి మాట్లాడే జగన్‌కు కౌంటర్ ఇస్తూ లేని నాలుగో పెళ్లాం జగనే అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయింది. టిట్ ఫర్ టాట్ అంటూ జనసైనికులు దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు. దీని మీద కౌంటర్లు మామూలుగా లేవు.
ఐతే వైసీపీ వాళ్లు మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకుని ఇదేం భాష అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారిక హ్యాండిల్లో కూడా పవన్ భాష గురించి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పోస్టు పెట్టారు. కానీ స్కూల్ పిల్లలున్న సభలో పవన్ పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి మాట్లాడినపుడు.. ఆయనకు జనసేనాని కౌంటర్ ఇవ్వడంలో తప్పేముందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్‌కు ఇది పవర్ పంచ్ అని.. ఇకనైనా ఆయన ఈ టాపిక్ వదిలేసి రాజకీయ విమర్శలకు పరిమితం అయితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.