భీమవరం అభ్యర్ధి ఫైనలైపోయారా ?

పశ్చిమగోదావరి జిల్లాలో ఎంత కీలకమైన భీమవరం నియోజకవర్గంలో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైనల్ అయిపోయారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భీమవరం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి వీరాంజనేయులు పోటీ చేయబోతున్నారు. ఇన్నిరోజులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి రెండు రోజుల్లో జనసేన లో చేరబోతున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా పులపర్తే మీడియాకు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే రాబోయే ఎన్నికల్లో తనను భీమవరంలో పోటీచేయమని పవన్ అడిగారట. పవన్ కు భీమవరంలో పోటీచేసే ఉద్దేశ్య లేదని చెప్పి తనను పోటీచేయమని అడిగారని పులపర్తన్నారు. తానేమో పవన్నే పోటీచేయమని చెప్పినా వద్దన్నారట. అంటే పులపర్తి చెప్పిందాని ప్రకారం జనసేన చేరిన తర్వాత పులపర్తే పోటీచేయబోతున్నారని తేలిపోయింది. మరింతోటి దానికి పవన్ భీమవరంలో కొంతకాలంగా ఎందుకింత హడావుడి చేశారో అర్ధంకావటంలేదు. పోటీచేసే ఉద్దేశ్యంలో లేనపుడు వరుసబెట్టి మీటింగులు పెట్టాల్సిన అవసరంలేదు.

టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మద్దతివ్వమని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది ? పొత్తులో భాగంగా జనసేన పోటీచేయబోయే సీట్లలో టీడీపీ ఎలాగూ మద్దతిస్తుంది కదా. ప్రత్యేకించి కొందరు ఇళ్ళకి వెళ్ళి జనసేనకు మద్దతిచ్చి గెలిపించాలని అడగటంతో అందరు పవనే పోటీచేస్తున్నారని అనుకున్నారు. మొత్తానికి పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలో పవన్లోని అయోమయం ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. భీమవరం నుండి పవనే పోటీచేస్తారన్న ఆలోచనతో జనసేనలోని నేతలెవరూ ఈ సీటుపై ఆశలు పెట్టుకోలేదు.

అలాంటిది చివరి నిముషంలో మిత్రపక్షం టీడీపీ మాజీ ఎంఎల్ఏని జనసేనలో చేర్చుకుని టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని పవన్ అనుకోవటమే అపరిపక్వతకు పరాకాష్టగా నిలుస్తోంది. అసలు భీమవరంలో పోటీ చేసే ఉద్దేశ్యం లేనపుడు ఇంకో నేతను ప్రోత్సహిస్తే బాగుండేది. లేదా పార్టీలోని నేతల్లోనే బలవంతులకు టికెట్ ఇచ్చినా మరోలాగుండేది. ఇదేమీ కాదని టీడీపీ నుండి పులపర్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పోటీచేయిస్తుండటమే విచిత్రంగా ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.