నా నాలుగో పెళ్లాం జ‌గ‌నే: ప‌వ‌న్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. సిద్ధం స‌భ‌ల్లో జ‌గ‌న్ త‌నను తాను.. అర్జునుడి ని అని చెప్పుకొంటున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చారు. “జ‌గ‌న్‌.. నువ్వు అర్జునుడివి కాదు. నేను వామ‌నుడిని. నువ్వు బ‌లి చ‌క్ర‌వ‌ర్తివి. 24.. 24… సీట్లు తీసుకున్నాన‌ని ఎగ‌తాళి చేస్తున్నారు.కానీ, ఒక్క సీటు చాలు..నిన్ను తొక్కేయ‌డానికి. నాడు వామ‌నుడు ఒక్క అడుగు కోరి బ‌లిచ‌క్ర‌వ‌ర్తిని అతః పాతాళానికి తొక్కేశాడు. అలానే నేను కూడా నిన్ను తొక్కేస్తాను. కాసుకో. నువ్వు సిద్ధం సిద్ధం అంటున్నావు. నేనుయుద్ధానికి వ‌స్తున్నా కాసుకో” అని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు.

అంతేకాదు.. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను బ‌య‌ట‌కు లాగుతున్నార‌ని వ్యాఖ్యానించిన ప‌వ‌న్‌.. త‌న నాలుగో పెళ్లాం జ‌గ‌నేన‌ని అన్నారు. “నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాన‌ని అంటున్నారు. ఆయ‌న‌(జ‌గ‌న్‌) మ‌రో అడుగు ముందుకు వేసి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాన‌ని.. రెండు విడాకులు తీసుకున్నాన‌ని అంటున్నాడు. నా నాలుగో పెళ్లాం జ‌గ‌నే. రా.. !” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

“వ్యూహాలు రచిస్తాం.. జగన్‌ కోటలు బద్ధలు కొడతాం. సిద్ధం సిద్ధం అంటున్నావ్.. కానీ నీకు నేను యుద్ధాన్ని ఇస్తున్నా. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు. వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు. మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే ఊరుకునేది లేదు. ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తోంది. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్నా.. సామాన్య‌ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెట్టినా.. మ‌క్కెలు ఇర‌గ‌దీసి మంచంలో ప‌డేస్తా” అని ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చారు.

చంద్ర‌బాబు అనుభ‌వ శీలి అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఆయ‌న అనుభ‌వంతోనే ఒక న‌గ‌రాన్ని(అమ‌రావతి) నిర్మించాల‌ని భావించార‌ని.. కానీ, వైసీపీ రాక్ష‌సులు దానిని నాశ‌నం చేశారు. ఇప్పుడు మ‌రోసారి అనుభ‌వం ఉన్న నాయ‌కుడు రాష్ట్రానికి అవ‌స‌రం ఉంద‌ని అందుకే చంద్ర‌బాబుతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న‌కు స‌ల‌హాలు ఇవ్వొద్ద‌ని పార్టీ కేడ‌ర్‌కు సూచించారు. “నాతో న‌డిచే వాళ్లే నా వాళ్లు. న‌న్ను ప్ర‌శ్నించొద్దు. నాతో క‌లిసి న‌డ‌వాల‌ని అనుకుంటే న‌న్ను అనుస‌రించండి” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “పవన్‌తో స్నేహం అంటే చచ్చేదాకా.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా” అని వ్యాఖ్యానించారు.