టీడీపీ-జనసేన మిత్రపక్షంలో జోష్ మామూలుగా లేదు. ఏకంగా 360 డిగ్రీల్లో కనిపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో తాజాగా నిర్వహించిన “తెలుగు జన విజయ కేతనం జెండా” బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీల అభిమానులు తరలి వచ్చారు. ఎటు చూసినా.. పసుపు-తెలుగు వర్ణాల మిశ్రమంగా సభా ప్రాంగణం అలరారింది. ఏ నోట విన్నా.. జై బాబు, జై పవన్‌ల నినాదాలే మిన్నంటాయి. రహదారులు కిక్కిరిసిపోయాయి. వాహనాల వర్షం కురిసిందా? అన్నట్టుగా ఎటు చూసిని ద్విచక్రవాహనాలు, కార్లే దర్శమిచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మిత్రపక్షం ముందుకు కదులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 118 స్థానాల్లో అవగాహనకు వచ్చి.. అభ్యర్థులను కూడా ఖరారు చేసిన మిత్రపక్షం.. ఈ క్రమంలో వెలుగు చూసిన చిన్న చిన్న సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో కార్యకర్తలు, నాయకత్వంలో వేడి పెంచేలా సంయుక్తంగా సభను ఏర్పాటు చేసింది. నిజానికి వచ్చే నెల 10 తర్వాత.. సభను పెట్టాలని అనుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో వేడిని తగ్గించకుండా ఉండేందుకు వెంటనే రెడీ కావడం మంచిదన్న ఉద్దేశంతో టికెట్లు ప్రకటించిన ఐదు రోజుల్లోనే భారీ బహిరంగ సబకు ప్లాన్ చేశారు.
ఎక్కడెక్కడి నుంచో..
తాడేపల్లి గూడెం శివారులోని నిర్వహించిన సభకు భారీ భద్రత మధ్య టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేరుకున్నారు. వీరితోపాటు ఇరుపార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక, కేవలం ఉమ్మడి పశ్చిమ నుంచే కాకుండా ఉభయ గోదావరులు, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలు, విజయవాడ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఈ సభకు తరలి వచ్చారు. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా చేరుకున్నారు. ఎటు చూసినా.. బాబు, పవన్ జెండాలు, ఇరు పార్టీలు జెండాలు కనిపించాయి.
ఆశ్చర్యకరంగా..
ఈ సభలో అందరూ ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది. సభావేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లు.. వ్యవహరించిన తీరు ఇరు పార్టీల కార్యకర్తల్లోనూ జోష్ నింపింది. సభలో టీడీపీ భారీ పతాకాన్ని.. పవన్ పట్టుకోగా, జనసేన భారీ పతాకాన్ని చంద్రబాబు పట్టుకుని.. ఇరువురు చాలా సేపు గాలిలో ఊపుతూ.. కనిపించారు. ఇది చాలా అరుదైన ఘట్టం. దీంతో ఇరు పక్షాల కార్యకర్తల్లోనూ ఉమ్మడిగా సాగాలనే సంకేతాలు పంపినట్టు అయింది. ఈ సందర్భంగా.. సభలో పెద్ద ఎత్తున ఇరు పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates