తీరిక లేకుండా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నిజంగెలవాలి యాత్రలో ఉన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి కొద్ది సేపు రిలాక్స్‌డ్‌గా కాఫీ కబుర్లు చెప్పుకొంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది.. మనసుకు కొంత రిలీఫ్ కూడా ఇస్తుంది. అదే పని జరిగింది. కాకపోతే.. ట్విట్టర్ వేదికగా! “అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి” అని చంద్రబాబు తన సతీమణిని ట్విట్టర్ ద్వారా అడిగారు. ఇలా చంద్రబాబు అడగడానికి కారణం అరకు కాఫీ షాప్ ముందు కూర్చుని భువనేశ్వరి కాఫీ తాగుతూ ఫోటో దిగారు.
ఆ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో భువనేశ్వరి పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు చంద్రబాబు తన అధికారిక ఖాతా నుంచి.. కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి అని ప్రశ్నించారు. చంద్రబాబు ట్వీట్ చేసిన కొంత సేపటికి భువనేశ్వరి కూడా స్పందించారు. కాఫీ అద్భుతంగా ఉందన్నారు. మన కిచెన్ లో ఉన్నప్పటికీ అరకు ప్రకృతి మధ్య అరకు కాఫీ తాగితే కలిగే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. ఇక్కడి గిరిజనుల ఆత్మీయత అరకు కాఫీకి ప్రత్యేకమైన రుచి వస్తుందేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అదే సమయంలో అరకు కాఫీని ప్రమోట్ చేసిన చంద్రబాబు కృషిని కూడా భువనేశ్వరి గుర్తు చేసుకున్నా రు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు బ్రాండ్ కాఫీని అంతర్జాతీయంగా మార్కెట్ చేసే అవకాశాల్ని కల్పించారు. గిరిజనలకు మంచి ఉపాధి లభించడంతో పాటు..అరకు కాఫీకి ప్రపంచ ప్రసిద్ధమైన గుర్తింపు వచ్చింది. అమెరికాలో కూడా పలు చోట్ల స్టాల్స్ ఉన్నాయి. అరకు కాఫీని చంద్రబాబు ప్రమోట్ చేసిన విషయాన్ని నారా భువనేశ్వరి తన ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు.
విశాఖ మన్యంలో అరకు కాఫీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రాంత ఇది. ఇక్కడ పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్ళు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు.