కేసీయార్ కు రెస్టేనా ?

పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మార్చి 1వ తేదీన పార్టీలోని సుమారు 200 మంది నేతలతో ఛలో మేడిగడ్డ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలను జనాలందరికీ వివరించటానికే తాము ఛలో మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నట్లు కేటీయార్ చెప్పారు. బ్యారేజి నిర్మాణంపై రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా పర్యటన, పరిశీలన ఉంటుందని కేటీయార్ చెప్పారు.

కేటీయార్ చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి కానీ కేసీయార్ విషయం ఏమిటన్నదే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే అంతసేపు మాట్లాడిన కేటీయార్ పొరబాటున ఒక్కసారి కూడా కేసీయార్ పేరును ప్రస్తావించలేదు. రేవంత్ రెడ్డి, మంత్రులందరు కేసీయార్ అవినీతిమీదే పదేపదే టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి కేసీయార్ అవినీతి వల్లే నాశనం అయిపోయాయని మండిపోతున్నారు. దానికి జవాబుగానా అన్నట్లు నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తొందరలోనే మేడిగడ్డకు వెళతామని అప్పట్లో ప్రకటించారు.

కేసీఆర్ ప్రకటన విన్నవాళ్లకు మేడిగడ్డ బ్యారేజి పర్యటనను కేసీయారే లీడ్ చేస్తారని అనుకున్నారు అందరు. కానీ ఇపుడు కేటీయార్ ప్రకటనలో ఎక్కడా కేసీయార్ ప్రస్తావన రాలేదు. మామూలుగా అయితే మేడిగడ్డ పర్యటనకు వెళ్ళే బృందానికి కేసీయారే నాయకత్వం వహిస్తారని అందరు అనుకున్నారు. కాని అందరి అంచనాలకు కేటీయార్ మాటలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి బ్యారేజి పరిశీలనకు కేసీయార్ వెళ్ళేది అనుమానంగా ఉంది.

కారణాలు స్పష్టంగా తెలియడం లేదు కేసీయార్ పూర్తికాలం రెస్టుకే పరిమితమవుతున్నారు. పబ్లిక్ లో తిరగడానికి ఏ మాత్రం ఇష్టపడటంలేదు. అసెంబ్లీ సమావేశాలకు రాలేదు, ఓడిపోయిన తర్వాత కనీసం మీడియా సమావేశం కూడా పెట్టలేదు. తుంటి ఎముక విరగటం, ఆపరేషన్, విశ్రాంతి పేరుతో బయట తిరగటమే లేదు. మరి కేసీయార్ తీరును చూస్తుంటే రేపటి పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి అయినా వస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయినా మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం అనుమతిస్తుందా ? ఎందుకంటే కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల్లో ఎవరినీ బ్యారేజి దగ్గరకు వెళ్ళనీయలేదు కాబట్టే.