వైసీపీకి మాగుంట రాజీనామా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బుధ‌వారం ఉద‌యం ఒంగోలు లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ మేర‌కు ఆయ‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. నాకు అహంలేదు.. ఆత్మ‌గౌర‌వం ఉంది! అని మాగుంట వ్యాఖ్యానిం చారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో మాగుంట కుటుంబం ఆత్మ‌గౌర‌వాన్ని పోగొట్టుకోలేద‌ని ప‌రోక్షంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్న‌ట్టు తెలిపారు.

వైసీపీకి రాజీనామా చేయాల‌ని అనుకోలేద‌ని, కానీ, చేయాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. తనకు సీఎం జ‌గ‌న్ ఇచ్చిన సహాయ సహకారాలు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఏ పార్టీ నుంచి అనేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని మాగుంట ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే.. వైసీపీలోకి ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చారు. అంత‌కు ముందు 2014 వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉన్న మాగుంట‌.. విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీ బాట ప‌ట్టారు.

ఆ ఎన్నికల్లో ఆయ‌న టీడీపీ టికెట్‌పై ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత‌.. చంద్రాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అయితే, 2019 ముందు కూడా సీటు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించినా.. వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఒంగోలు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఆరు మాసాలుగా ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు చెలరేగి.. సీఎం జ‌గ‌న్ మాగుంట‌ను ప‌క్క‌న పెట్టారు.

సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం..

మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ‌ రాజకీయ ప్ర‌స్థానం ఉంది. ఆయ‌న సోద‌రుడు నుంచి ప్రారంభ‌మైన ఈ రాజ‌కీయం ప్రకాశం జిల్లాలో 33 ఏళ్లుగా కొన‌సాగుతూనే ఉంది. ఎనిమిది సార్లు పార్లమెంట్, 2 సార్లు అసెంబ్లీ, ఒకసారి ఎమ్మెల్సీగా శ్రీనివాసుల రెడ్డి ప‌నిచేశారు. మ‌ద్యం స‌హా అనేక వ్యాపారాలు ఈ కుటుంబం నిర్వ‌హిస్తోంది.