టీడీపీ అధినేతకు టికెట్ల కేటాయింపు కన్నా.. బుజ్జగింపులు పెద్ద చిక్కుగా మారాయి. ఇటీవల ప్రకటించిన 94 స్థానాల్లో అభ్యర్థులను ఒకవైపు లైన్‌లో పెడుతూనే.. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి.. భంగ పడిన నాయకులను బుజ్జగించే పనిలో రోజురోజంతా చంద్రబాబు తీవ్రస్థాయిలో చర్చోపచర్చల్లో మునిగిపోయారు. తన నివాసంలో ఆశావహులను కలుస్తూ.. వారిని ఊరడిస్తున్నారు. తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు వరుస పెట్టి బాబును కలుస్తున్నారు. దీంతో ఆయా నేతలను బుజ్జగించి, రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
- చంద్రబాబు నివాసానికి కడప పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ సీటు ఆశిస్తున్న ఆయన తన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో పార్టీ పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.
- చంద్రబాబుతో తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ భేటీ అయ్యారు. వాస్తవానికి తంబళ్లపల్లి స్థానాన్ని జయచంద్రా రెడ్డికి కేటాయించారు. ఇక, ఇదే సీటు కోసం చంద్రబాబును కలిసి శంకర్ యాదవ్‌కే సీటు ఇవ్వాలని పలువురు నేతలు కోరారు.
- ఇక, రెండు రోజుల్లో వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా చేయనున్నారు. ఈయన కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే చాన్స్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చి.. ఆయనకు ఇవ్వద్దని కోరుతున్నారు.
- సీనియర్ నేత కోవెలమూడి రవీంద్ర చంద్రబాబును కలిశారు. గుంటూరు-2 స్థానానికి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రవీంద్ర వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే.. ఇంకా పరిశీలనలో ఉందని చంద్రబాబు చెప్పారు. దీంతో ఆయన ముభావంగా వెనుదిరిగారు. ఇక, తెనాలి టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా మరోసారి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు-2 టికెట్ ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం.
- ఉమ్మడి అనంతపురంలోని శింగనమలకు బండారు శ్రావణిని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కేశవరెడ్డి, నర్సానాయుడు చంద్రబాబును కలిసి.. శ్రావణిని మార్చాలని డిమాండ్ చేశారు. అయితే.. చంద్రబాబు వారి విన్నపాలు తిరస్కరించారు. శ్రావణి గెలుపునకు కృషి చేయాలని ఇద్దరికీ చంద్రబాబు ఆదేశించినట్టు తెలిసింది.
- ఇక, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలో జయనాగేశ్వరరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో తనకు టికెట్ ఎక్కడైనా ఒక చోట ఇవ్వాలని కోరారు. కానీ, గ్రాఫ్ బాగోలేదని ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు.