ప్రస్తుతం ఏపీలో మైలవరం శాసనసభ టికెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో మైలవరం అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించలేదు. టికెట్ పై చంద్రబాబు నుంచి హామీ వచ్చిన వెంటనే ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైలవరం టికెట్ ను ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు.
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. తమిళనాడు మాదిరిగా నాయకులు వంగి వంగి దండాలు పెట్టడం, పాదాభివందనాలు చేయడం, బూతులు మాట్లాడడం చెల్లదని అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని సంచలన విమర్శలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ కేసినేని నాని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు విభేదాలున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరతారని ప్రచారం జరిగినా…తాను వైసీపీలోనే ఉన్నానని ఆయన క్లారిటీనిచ్చారు. అయితే, మైలవరం ఇన్చార్జిగా మరో వ్యక్తిని జగన్ నియమించడంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు అధికారికంగా తాను టిడిపిలో చేరుతున్నానని ప్రకటించారు. మరి, టికెట్ హామీ లభించే వసంత టీడీపీలో చేరబోతోంటే…దేవినేని పరిస్థితి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates