ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ సువార్తీకుడు.. బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా సీఎం జగన్ ప్రభుత్వంపైనా.. జగన్‌పైనా విమర్శలు గుప్పించారు. “అన్యాయాన్ని ఆ దేవుడే ఓడిస్తాడు“ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికలకు ముందు ప్రత్యేక పర్యటనలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కీలకమైన ప్రాంతాలలో చర్చలకు వెళ్లి ప్రత్యేక `ప్రార్థన`లు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడులోఆయన రహస్యంగా పర్యటించారు.
క్రైస్తవ సువార్త ప్రకటనలు, మత బోధన కార్యక్రమంలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్.. పరోక్షంగా సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. రాజకీయాలపై స్పందించాలన్న ప్రశ్నకు ఆయన రాజకీయాలపై స్పందించనని అంటూనే.. ఏపీలో పాలనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. “ఏం జరుగుతోందో మా కంటే మీకే ఎక్కువగా తెలుసు. నేను పెద్దగా మాట్లాడకూడదు. చేయాల్సిన పని ఆ దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడని నేను విశ్వసిస్తున్నా. అన్యాయాన్ని.. అక్రమాలను.. ఆ దేవుడు ఓడిస్తాడు. తాత్కాలిక ఆనందం కోసం వేధించరాదు“ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల .. విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం.. ఆఫీసులోనే నిర్బంధం చేయడం తెలిసిందే. దీనిపై అనిల్ స్పందిస్తూ.. “ఇలాంటి వాటిపై నేను మాట్లాడకూడదు.. “ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు మాసాల కాలంలో అనిల్ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు పెట్టుకోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు ఆయన పర్యటనలు.. కలుస్తున్న సంఘాలు వంటివి రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా.. బ్రదర్ అనిల్ ఇలానే ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. వైసీపీకి పరోక్షంగా ప్రచారం చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates