ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుటున్న భస్మాసురుడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలో తాజాగా నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో అందరూ బాధితులేనని, అందులో తానూ ఉన్నానని అన్నారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలు అయ్యారని.. వైసీపీ నేతలు మాత్రం ధనవంతులయ్యారని మండిపడ్డారు. నమ్మి ఓటు వేసిన ప్రజలను జగన్ నిలువునా ముంచేశారని అన్నారు.
‘ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు మళ్లింది. టీడీపీ హయాంలో 2029 విజన్ రూపొందించాం. 2019లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ ఉండేది.’ అని చంద్రబాబు అన్నారు. ‘ఒక్క ఛాన్స్ అంటూ అడగ్గా.. నమ్మి ఓటేసిన ప్రజల్ని సీఎం జగన్ మోసం చేశాడు. ఇప్పుడు మీ ఓటుతో వారికి తగిన బుద్ధి చెప్పాలి. భస్మాసురుడిలా జగన్ ప్రజల నెత్తిన చేయి పెట్టారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తొలి జాబితాపై మాట్లాడిన చంద్రబాబు.. జాబితాలో అందరికీ న్యాయం చేకూర్చామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. అలాగే, యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. అవసరమైతే వర్క్ షాప్స్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా బలహీనవర్గాలు ఉన్నాయని.. ఆర్థికంగా, సామాజికంగా వారిని ఆదుకోవడం టీడీపీ – జనసేన ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రపై హామీల వరద
- ఉత్తరాంధ్రలోని బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.
- మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసి డిక్లరేషన్ ప్రకటిస్తాం.
- చెత్తపన్నును ఎత్తేస్తాం. రైతులకు సబ్సిడీలు అందజేస్తాం.
- సుజల స్రవంతి ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాంతానికి నీళ్ల సమస్య ఉండదు.
- వంశధార – నాగావళి నదులను అనుసంధానం చేస్తాం.
- పలాసలో ఢిపెన్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు
- నరసన్నపేట పరిధిలోని బొంతు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,
- పలాస – కాశీబుగ్గ రైల్వే ఫ్లై ఓవర్ ను పూర్తి చేస్తాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates