ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రను దోచుకునేందుకే వారు ఈ జిల్లాలకు ఇన్చార్జిలుగా వచ్చారని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల ఆరోపణలను నిజం చేస్తూ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
ఎవడో సుబ్బారెడ్డి అంట కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తాం అంటున్నాడు అని ధర్మాన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ అబ్బ సొమ్ము కాదు..తంతా పొమ్మని ఆ సుబ్బారెడ్డికి తాను వార్నింగ్ ఇచ్చాను అని ధర్మాన చెప్పుకొచ్చారు. వచ్చినవాడు ఏ పార్టీ అనేది చూడనని, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తానంటే అవమానంగా భావిస్తానని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలాగే వదిలేస్తే శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రౌడీల మయం అయిపోతుందని, ప్రశాంతంగా పట్టణాలు ఉండాలని చెప్పారు.
ఇన్ని చేసినా మీకు నేను పనికి రాకపోతే మీ ఇష్టం అంటూ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ధర్మాన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. విజ్ఞతతో ఆలోచించాలని, ప్రజల అభిమానంతోనే తాను గెలుస్తున్నానని అన్నారు. గెలిస్తే శక్తివంతంగా ఉంటానని, ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని ధర్మాన వ్యాఖ్యానించారు. అయితే, తన కుమారుడికి ధర్మాన వైసిపి టికెట్ ఆశించగా దానికి సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డిపై ధర్మాన ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.