అన్నీ కవితే డిసైడ్ చేస్తారా ?

కల్వకుంట్ల కవిత వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈనెల 26వ తేదీన అంటే సోమవారం  విచారణకు హాజరవ్వాలని సీబీఐ ఇదివరకే కవితకు నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరవ్వటం కుదరదని కవిత బదులిచ్చారు. దాంతో కవితను లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా చేర్చుతు సీఆర్పీసీ సెక్షన్  41ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందే అని సీబీఐ మళ్ళీ నోటీసులు జారీచేసింది. దానికి కవిత ఆదివారం మళ్ళీ ఇంకో లెటర్ రాశారు.

అందులో ఏముందంటే తనను నిందితురాలిగా పేర్కొనటం సరికాదన్నారు. అలాగే తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. వెంటనే 41ఏ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసును రద్దు చేయాలి లేదా ఉపసంహరించుకోవాలని కవిత తన లేఖలో సీబీఐని డిమాండ్ చేశారు. ఇక్కడే కవిత వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తనకు ఏ సెక్షన్ కింద విచారించాలనే విషయాన్ని కూడా కవితే డిసైడ్ చేసేట్లున్నారు. లేకపోతే సీబీఐ ఇచ్చిన నోటీసును తప్పుపట్టడం ఏమిటో అర్ధంకావటం లేదు.

పైగా ముందే నిర్ణయించుకున్న ప్రోగ్రాములు ఉన్నాయి కాబట్టి విచారణకు హాజరుకాలేనని లేఖలో చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే దర్యాప్తు సంస్ధలంటే కవితకు ఎంత చులకనగా కనబడుతున్నాయో  అర్ధమవుతోంది. ఒకపుడు దర్యాప్తు సంస్ధ నుండి నోటీసు వచ్చి విచారణకు రమ్మంటే ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా హాజరయ్యేవారు. అలాంటిది ఇపుడు నోటీసిచ్చిన దర్యాప్తు సంస్ధనే తప్పుపట్టడం, నోటీసులో ఏ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలో ఇవ్వకూడదో కవితే చెబుతున్నారంటేనే  ఆశ్చర్యంగా ఉంది.

ఇప్పటివరకు విచారణకు రమ్మని ఈడీ దాదాపు ఐదుసార్లు నోటీసులిస్తే కవిత లెక్కచేయలేదు. ఒకసారి మాత్రం రెండు రోజులు విచారణకు హాజరయ్యారు. అంతే ఆ తర్వాత అసలు ఈడీని కవిత లెక్కేచేయటం లేదు. పైగా మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించకూడదని సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. విచారణకు పిలిపించి ఆరెస్టు చేస్తారనే భయం  కవితలో పెరిగిపోతోందా ? లేకపోతే లోపాయికారీగా జరిగిన  అవగాహన ప్రకారమే ఈడీ-కవిత, సీబీఐ-కవిత వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.