తాజాగా ప్రకటించిన టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాల విషయంలో రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని కొన్ని స్థానాలను ఆశావహులకే కేటాయించినా.. మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం ముఖ్య నేతలకు మొండి చేయి చూపించారు. దీంతో ఆయా స్థానాల్లో అసమ్మతి తెరమీదికి రావడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు, తెనాలి, రాజమండ్రి రూరల్, కళ్యాణదుర్గం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పరిస్థితి డోలాయమానంలో పడింది.
తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. గత నాలుగున్నరేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారు. రాజధాని ఉద్యమంతో సహా.. టీడీపీ ప్రకటించిన అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అయితే.. ఈ దఫా సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఆపార్టీ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికే ఆలపాటి.. తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించుకున్నారు. ఒకవేళ పోటీ చేయకపోయినా.. సహకరించడం మాత్రం జరిగేది కాదు.
ఇక, రాజమండ్రి రూరల్‌ను ఎవరికీ ప్రకటించకపోయినా.. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం కావడం.. సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉండడంతో ఇక్కడ ఎవరికీ అవకాశం ఇప్పుడే ప్రకటించలేదు. కానీ, జనసేన నుంచి కందుల దుర్గేష్‌కు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే..చంద్రబాబు మాత్రం ఇద్దరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరిని వేరే చోటకు బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఆయన ఒప్పుకొనే అవకాశాలు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి.
ఇక, కళ్యాణదుర్గంలోనూ .. కొత్తవారికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అమిలినేని సురేంద్రబాబుకు ఇక్కడ టికెట్ ప్రకటించారు. వాస్తవానికి ఇంచార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కొన్నాళ్లుగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈ ఇద్దరికీ కూడా ప్రకటించలేదు. దీంతో వీరిద్దరూ అసమ్మతి బాట పట్టనున్నారనే వాదన వినిపిస్తోంది.