తప్పు.. ఎక్కడ చేసినా పర్వాలేదు. సరిదిద్దుకోవచ్చు. కానీ, బలమైన ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉండగా.. తప్పు లు చేస్తే.. అవి కాస్తా ప్రజల్లోకి వెళ్తే.. కొంపే మునుగుతుంది. మరి ఈ విషయం ఆలోచించారో లేదో తెలియదు కానీ.. జనసేన ఇప్పుడు పెద్ద తప్పేచేసిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమని.. తాజాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 24 చోట్ల జనసేన పోటీ చేస్తుందనిస్వయంగా చంద్రబాబు చెప్పారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు.. టీడీపీ కంటే కూడా జనసేన అభ్యర్థుల జాబితా కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. ఇక, జాబితాలు ప్రకటించడం మొదలయ్యాక.. జనసేన పై పెదవి విరుపు లు కనిపించడం మొదలయ్యాయి. ఇది పక్కా వాస్తవం. ఎందుకంటే.. 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామన్న జనసేన కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించి.. చేతులు దులుపుకొంది.
ఆ ఐదుగురు అభ్యర్థుల్లో తెనాలి – నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ ఉన్నారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, ఈ పరణామం రాజకీయంగా కూడా.. వివాదాలకు దారితీసింది. ఇప్పటికే వైసీపీ నాయకులు.. జనసేనకు అభ్యర్థులు లేరని..అందుకే 24 ప్రకటించి కూడా ఐదుగురు మాత్రమే అభ్యర్థులకు కేటాయించారని నిప్పులు చెరుగుతున్నారు.
అయితే.. దీనిలో కందుల దుర్గేష్, విజయవాడకు చెందిన పోతిన మహేష్, పార్టీ అధినేత పవన్, బొలిశెట్టి శ్రీనివాస్ వంటి వారిపేర్లు లేకపోవడం గమనార్హం. మరి మలిజాబితాలో అయినా ప్రకటిస్తారేమో చూడాలి. ఇలాంటప్పుడు.. 24 అని ప్రకటించడం ఎందుకు? అనేది ప్రశ్న.