మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లేనా ? అవుననే పార్టీలో సమాధానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే గంటా మీడియాతో మాట్లాడుతు తాను రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేస్తానని చెప్పారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టంగా ప్రకటించారు. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే అక్కడ పోటీ చేయడం గంటాకు ఏమాత్రం ఇష్టంలేదు.
కారణం ఏమిటంటే ఆ నియోజకవర్గంలో మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొత్సను ఢీకొట్టి గెలవటం కష్టమన్నది గంటా అభిప్రాయంగా కనబడుతోంది. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా విశాఖ జిల్లాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకర్గంలో తనను పోటీ చేయమని చెప్పటం ఏమిటని గంటా గోల చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచన చూస్తుంటే గంటాకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం ఇష్టం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే వైజాగ్ జిల్లాలో పోటీచేసేందుకు నియోజకవర్గం లేదు కాబట్టి విజయనగరం జిల్లాకు పొమ్మన్నట్లున్నారు.
నాలుగు ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసిన గంటాకు జిల్లా మార్చినా నష్టం లేదని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అందుకనే చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందే అని గట్టిగా చెప్పింది. చంద్రబాబు చెప్పటం బాగానే ఉంది మరిపుడు గంటా ఏమిచేస్తారు ? చీపురుపల్లిలో పోటీచేయనని ప్రకటించటాన్ని థిక్కారంగానే చూస్తున్నారు. పైగా తాను విశాఖ జిల్లాలోనే పోటీచేస్తానని కూడా ప్రకటించారు. గంటాకు పోటీచేయటానికి నియోజకవర్గం ఉందా అనేది అనుమానం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని 15 సీట్లలో పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కనీసం ఐదు నియోజకవర్గాలివ్వాలి. మిగిలిన పదిలో రిజర్వుడు పోను మిగిలేది ఏడు నియోజకర్గాలే.
వీటిల్లో ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు ఎప్పటినుండో పనిచేసుకుంటున్నారు. కాబట్టి గంటా కోసం త్యాగంచేయటానికి ఎవరు సిద్ధంగా లేరు. పైగా చాలామందికి గంటా అంటే ఏమాత్రం పడదు. గంటా తాజా మాటలుచూస్తుంటే పార్టీ మారుతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ మారిపోయి తాను కోరుకున్న నియోజకర్గంలో పోటీచేస్తారా ? లేకపోతే ఇండిపెండెంటుగా పోటీచేస్తారా అన్నది చూడాలి.