‘ఇండియా’కు పాజిటివ్ సంకేతాలా ?

ఒడిదుడుకులతో ఇబ్బందులు పడుతున్న ఇండియా కూటమికి పాజిటివ్ సంకేతాలు కనబడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కూటమిలో ఇంతకాలం కీలకంగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ తో పంచుకోవటానికి ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్), తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించేదిలేదని తేల్చిచెప్పేశాయి. దాంతో కూటమంతా గందరగోళంగా తయారైంది. ఇవన్నీ చూసిన తర్వాతే నితీష్ ఇండియా కూటమికి హ్యాండిచ్చి ఎన్డీయేలోకి మారిపోయింది.

అయితే తాజా పరిణామాలు ఏమిటంటే ఢిల్లీలో కాంగ్రెస్ తో పార్లమెంటు సీట్లను షేర్ చేసుకోవటానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో ఆల్రెడీ కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు అయిపోయింది. యూపీలోని 80 సీట్లలో కాంగ్రెస్ కు 17 సీట్లు కేటాయించటానికి ఎస్సీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంగీకరించారు. ఈ విషయం అఖిలేషే స్వయంగా చెప్పారు. దాంతో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ కు సజావుగా జరిగిపోయింది.

మిగిలిన 63 సీట్లలో ఎస్పీ పోటీచేస్తుందని అఖిలేష్ ప్రకటించారు. అలాగే ఢిల్లీలోని ఏడు పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ తో పంచుకోవటానికి అభ్యంతరం లేదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన కూడా సానుకూలతను పెంచేదే అనటంలో సందేహంలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ తో సీట్ల షేరింగ్ కు కేజ్రీవాల్ అంగీకరించారు కాబట్టి పంజాబ్ లో కూడా లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ కు ఆప్ కేటాయిస్తుందనే అనుకుంటున్నారు.

ఇక తేలాల్సింది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యవహారమే. ఈమెది పూర్తిగా చంచల స్వభావం. ఒకరోజున్నట్లు మరుసటిరోజు ఉండరు. ఇప్పటికైతే బెంగాల్లో కాంగ్రెస్ కు సీట్లను పంచుకునేది లేదని ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు. సడెన్ గా రేపు సీట్ల షేరింగ్ కు అంగీకరించవచ్చు. సీట్ల షేరింగుకు మమత ఒప్పుకునేట్లుగా కూటమిలోని మిగిలిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్లో గనుక సీట్ల షేరింగ్ జరిగితే మిగిలిన రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు పెద్ద సమస్య కాదు. సీట్ల షేరింగ్ జరగటంవేరు, జరిగిన సర్దుబాటుకు కట్టుబడుండటం వేరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తంమీద ఇప్పటికైతే ఇండియా కూటమికి సానుకూల సంకేతాలు అందుతున్నాయనే చెప్పాలి.