క‌విత‌కు మ‌ళ్లీ నోటీసులు.. వ‌ద‌లని మ‌ద్యం కేసు

kavitha

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసుల్లో ఆదేశించింది. అయితే.. ఈ నోటీసులు బుధ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత‌.. ఆమెకు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా ఉద్దేశ పూర్వ‌కంగా చేస్తున్నార‌న్న వాద‌న బీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

లిక్కర్‌ కేసులో కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు గతంలో ఆమె ఇంటి దగ్గర విచారణ చేశారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో బీఆర్ ఎస్ శిబిరంలో అల‌జ‌డి రేగింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు. తాజాగా సీబీఐ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక‌, లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడీపై వేసిన పిటిషన్ ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.

లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను కవిత గతేడాది సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల బెంచ్ దీన్ని విచారణ చేసింది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇస్తు్న్నప్పటికీ కవిత గైర్హాజరవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈడీ నోటీసులు రావ‌డంతో ఏం చేస్తార‌నేది చూడాలి.

త‌ప్పించుకుంటున్న కేజ్రీవాల్‌

మ‌రో వైపు ఇదే కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్న‌ప్ప‌టికీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త‌ప్పించుకుంటున్నారు. ఇప్ప‌టికి 5 సార్లు ఆయ‌న‌కు నోటీసులు పంపించారు. అయితే.. ఇదంతా ఎన్నిక‌ల‌కు ముందు ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ‌ను ఇబ్బంది పెట్టాల‌నే వ్యూహంతోనే మోడీ స‌ర్కారు ఇలా చేస్తోంద‌ని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌విత కూడా ఇలానే వ్యాఖ్యానిస్తారా? లేక హాజ‌ర‌వుతారా? అనేది చూడాలి. మ‌రోవైపు.. కేసీఆర్ డిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. దీనికి ముందు ఇలా నోటీసులు రావ‌డం కూడా.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.