పవన్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చేసినట్లే

2014 ఎన్నికల్లో పార్టీని పోటీలో నిలపకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు మాత్రమే ఇచ్చి ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. తర్వాతి ఎన్నికల్లో టీడీపీకి దూరమై సొంతంగా పార్టీని బరిలో నిలిపారు. కానీ దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు పవన్. పవన్‌ను ఓడించడానికి వైసీపీ ఏం చేయాలో అన్నీ చేసింది. భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లోనూ త్రిముఖ పోటీ వల్ల పవన్‌కు ఓటమి తప్పలేదు.

ఐతే ఈసారి టీడీపీతో పొత్తుతో బరిలో నిలుస్తున్నారు పవన్. ఐతే ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఒకచోటే పోటీ చేస్తారా.. గత పర్యాయంలా రెండు చోట్ల బరిలో నిలుస్తారా అనే విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఐతే టీడీపీ, జనసేన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పవన్ ఒకచోటే పోటీ చేస్తారని.. అది భీమవరమే అని తెలుస్తోంది.

ఈ విషయంలో పవన్ బుధవారం ఒక క్లారిటీ ఇచ్చేశారు. మంగళవారం విశాఖపట్నానికి వెళ్లి అక్కడ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమై ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు పవన్. కొందరు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా తర్వాతి రోజు పవన్ భీమవరం వెళ్లి అక్కడ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, భీమవరం ఇన్‌ఛార్జ్ కూడా అయిన తోట సీతారామలక్ష్మి నివాసానికి పవన్ వెళ్లారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరి కొందరు నేతలు కూడా అక్కడ పవన్‌తో సమావేశం అయ్యారు.

తాను మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పి తనకు సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్ ఓటమికి పరోక్షంగా కారకుడైన టీడీపీ అభ్యర్థి చిట్టిబాబు నివాసానికి కూడా పవన్ వెళ్లి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారని స్పష్టమైనట్లే.