“రేపు నీ సాక్షికి కూడా అదే గతి పడుతుంది.. జగన్ రెడ్డీ! గుర్తు పెట్టుకో!! ” అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మీడియా సంస్థలకు చెందిన విలేకరులను కొట్టడం, ఒక మీడియా సంస్థ ఆఫీసుపై దాడి చేసిన నేపథ్యంలో బండారు పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “అధికారం శాస్వతం అనుకుంటున్నావు. కానీ, రేపు మారుతుంది. అప్పుడు నీ సాక్షి మీడియా, పత్రికల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఇప్పుడు జరిగిన దానికి నాలుగింతలు జరుగుతుంది” అని హెచ్చరించారు.
అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని దుయ్యబట్టారు. “రెండు నెలలు తర్వాత మేం అధికారంలో వస్తాం.. అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు? అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి పడుతుంది” అని బండారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న సీఎం జగన్‌పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈవెంట్ మేనేజర్‌ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
జగన్ క్షమాపణలు చెప్పాలి!
ఎయిర్ పోర్ట్ నుంచి శారదపీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని బండారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ పెడతారా? అని ప్రశ్నించారు. జగన్ ఏమన్నా.. పాకిస్థాన్‌కు వచ్చాడా? మేమేమన్నా.. పాకిస్థాన్‌లో ఉన్నామా? అనినిలదీశారు. “విశాఖ ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలి. బూతు రత్న కొడాలి నాని.. గంజాయి నాని.. ఆయన టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు.