నిన్న జ‌ర్న‌లిస్టు.. నేడు కార్యాల‌యం.. సంకటంలో మీడియా ..!

  1950లో పార్ల‌మెంటులో మీడియాపై చ‌ర్చ జ‌రిగింది. “మీడియాను మీరు నియంత్రిస్తున్నారు“ అంటూ.. అప్ప‌ట్లో జ‌నతాపార్టీ ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు. దీనికి స‌మాధానంగా ప్ర‌ధాని హోదాలో ఉన్న నెహ్రూ.. కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. “మీడియా నియంత్ర‌ణ ఈ దేశంలో సాధ్యం కాదు. అదే జ‌రిగితే.. ఇది ప్ర‌జాస్వామ్య దేశం కానేకాదు“ అని అన్నారు. ఆయ‌న ఉన్నన్నాళ్లూ అదే పంథాను పాటించారు. సొంత ప‌త్రిక‌ను న‌డుపుకొన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఏనాడూ.. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోలేదు. చైనాతో యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు నెహ్రూ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతూ.. సొంత ప‌త్రిక‌లో క‌ధనంతో పాటు.. ఎడిటోరియ‌ల్ కూడా రాశారు.

అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు 77 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. దేశంలో మీడియా ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌నీయాంశంగానే మారిపోయింది. ముఖ్యంగా త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశాలే కాదు.. ఆందోళ‌న‌ల‌కు కూడా దారితీస్తున్నాయి. నిజానికి 2014 నుంచి కూడా ఇలాంటి ప‌రిస్థితులు ఉన్నాయి. అధికారంలో ఎవ‌రు ఉన్నా.. మీడియాను నియంత్రించే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న‌ది నిర్వివాదాంశం. మీరు మా మీటింగుల‌కు రావొద్దంటూ.. గ‌త ప్ర‌భుత్వంలోనూ ఓ మీడియాకు ఆంక్ష‌లు విధించారు.

ఇక‌, ఇప్పుడున్న ప్ర‌భుత్వం కూడా.. కొన్ని మీడియా సంస్థ‌ల‌ను నేరుగానే విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, గ‌త రెండు రోజుల్లో ఎవ‌రూ ఊహించ‌డానికి కూడా వీల్లేని విధంగా మీడియాపై దాడులు జ‌రుగుతున్నాయి. ఓ ప‌త్రిక ఫొటో జ‌ర్న‌లిస్టును అధికార పార్టీ నాయ‌కులు త‌న్న‌డం.. ఆయ‌న గాయాల‌పాలై ఆసుప‌త్రిలో చికిత్స పొంద‌డం తెలిసింది. ఇది ఇంకా తెర‌మ‌రుగు కాక‌ముం దే.. మ‌రో ప్రాంతం(సీమ‌)లో ఎమ్మెల్యే అనుచ‌రులు ఏకంగా ఓ ప‌త్రికా కార్యాల‌యంపై రాళ్ల‌దాడి చేశారు. సిబ్బందిని బెదిరించారు. దీంతో వారు ప‌త్రికా కార్యాల‌యానికి .. తాళం వేసి ప‌రార‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, అదే ప‌త్రిక‌కు చెందిన మ‌రో విలేక‌రిపైనా.. దాడులు చేశారు. చావు తప్పిన‌ట్టు స‌ద‌రు విలేక‌రి తృటిలో త‌ప్పించుకున్నారు. ఈ ప‌రిణామాలు చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. ఇవి ప్ర‌జాస్వామ్య యుత‌మేనా? అనేచర్చ జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మీడియా కూడా అనే మాట ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వినిపిస్తోంది. యాజ‌మాన్యాలు అనుస‌రిస్తున్న విధానాలతో మీడియా మిత్రులు.. ఇప్పుడు తీవ్ర‌మైన సంక‌ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న దుస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. మ‌రి దీనిని అదుపు చేసేదెవ‌రు?  ఎప్పుడు లైన్‌లోకి వ‌స్తాయి? అనేది కాల‌మే నిర్ణ‌యించాలి.