కొడాలికి మైండ్ బ్లాంక్‌.. గుడివాడ‌లో కొత్త నేత‌కు టికెట్‌?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ భారీ షాక్ ఇవ్వ‌నున్నారా? గుడివాడ ఇలాకాలో నానికి బ‌దులుగా వేరే వారికి అవ‌కాశం ఇస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడాలికి చెక్ పెడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా గుడివాడ వ్యాప్తంగా వెలిసిన ఫ్లెక్సీలు.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ వంటివి గ‌మ‌నిస్తే.. మార్పు దిశ‌గా పార్టీ అడుగులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో కొడాలి నాని విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

త‌న వ్యాఖ్య‌లు.. కామెంట్ల‌తో నాని ఎప్పుడూ.. మీడియాలో నిలుస్తూనే ఉన్నారు. ఆయ‌న నోరు విప్పితే బూతులు మాట్లాడ‌తార‌ని.. ఆయ‌న బూతుల నేత అని టీడీపీ నాయ‌కులు కూడా విమ‌ర్శిస్తుంటారు. అదేవిధంగా ఆయ‌న‌పై ఒక‌ర‌కంగా ప్ర‌తి విమ‌ర్శ చేసేందుకు కూడా.. నాయ‌కులు జంకుతుంటారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో ఇప్ప‌టికి నాలుగు సార్లుగా విజ‌యం ద‌క్కించుకున్న కొడాలి .. జ‌గ‌న్ మంత్రివ‌ర్గం తొలిద‌శ‌లో కూడా సీటు సంపాయించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఐదో సారి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని, గెలుపు గుర్రం ఎక్కుతాన‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు.

అయితే, అనూహ్యంగా ఇప్పుడు గుడివాడ‌లో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మండ‌ల‌ హన్మంతరావు అనే పేరు ఇక్క‌డ వినిపిస్తోంది. గుడివాడ వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించ‌నున్న హ‌నుమంత‌న్న‌కు శుభాకాంక్ష‌లు అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ సీనియర్ నేతగా హ‌నుమంత‌రావును పేర్కొంటారు. అయితే.. ఈయ‌న ఎప్పుడూ మీడియా ముందుకు వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. అయితే.. కాంగ్రెస్‌లో ఈయ‌న రాజ‌కీయాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడని అంటారు.

ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా హ‌నుమంత‌రావు వ్యవహరిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు అనూహ్యంగా ఈయ‌న పేరు గుడివాడ‌లో వినిపిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో.. తెలియ‌దు కానీ.. ఊహించ‌ని ప‌రిణామంపై మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంత‌టి బ‌ల‌వంతులు అనుకున్న వారిని కూడా.. సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెడుతున్న నేప‌థ్యంలో ఈ మార్పు కూడా నిజ‌మే అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని సీనియ‌ర్ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఈ మార్పును ప్ర‌స్తుత ఎమ్మెల్యే కొడాలి నాని ఏమేర‌కు జీర్ణించుకుంటార‌నేది చూడాలి.