లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పోటీ?


తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నది సినిమా వాళ్లే. ఐతే జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు కాలం చేశాక తమిళనాట ఒక రాజకీయ శూన్యత నెలకొనగా దాన్ని భర్తీ చేయడానికి లోకనాయకుడు కమల్ హాసన్ భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఎన్నో ఆదర్శాలతో ఆయన మొదలుపెట్టిన మక్కల్ నీది మయం పార్టీ తొలిసారి గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ రెండుసార్లూ దారుణమైన ఫలితాలే వచ్చాయి. కమల్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీస ప్రభావం కూడా చూపకపోవడంతో ఆయన పార్టీ ఇన్‌యాక్టివ్ అయిపోయింది.

ఎన్నికలు అయిన వెంటనే ఆయన కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం.. ఆయన తనయుడైన నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌తో ఎంతో సన్నిహితంగా మెలగడం, కలిసి సినిమాలు కూడా నిర్మించడంతో ఇక ఆయన రాజకీయాల్లో ఏం ఎదుగుతారు అనే ప్రశ్నలు రేకెత్తాయి. కమల్ ఇక రాజకీయాలకు దూరమైనట్లే అని భావించారు. అప్పుడప్పుడూ మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలేవో చేస్తున్నారు కానీ.. మక్కల్ నీదిమయం ప్రభావం అయితే అంతగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో కమల్ మళ్లీ రాజకీయాల మీద దృష్టిసారించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇంకో రెండు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నీదిమయంను పోటీలో నిలపబోతున్నారట కమల్. అధికార డీఎంకేతో ఆయన పార్టీ పొత్తు పెట్టుకోనుందట. కొంతమంది అభ్యర్థులను బరిలోకి దించుతారట. దీని గురించి పరోక్షంగా ఒక ప్రకటన కూడా చేశారు కమల్. ఇంకో రెండు రోజుల్లో శుభవార్త బయటికి వస్తుందని ఆయన అన్నారు. మరి ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున వేరే అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటారా.. కమల్ కూడా పోటీలో నిలుస్తారా అన్నది ఆసక్తికరం.