నారా బ్రాహ్మణి. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నందమూరి కుటుంబం ఆడపడుచు.. నారా వారి ఇంటి కోడలు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ సతీమణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి.. మంగళగిరిలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన భర్త నారా లోకేష్‌ను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రాహ్మణి వచ్చారు.ఈ సందర్భంగా ఆమె మంగళగిరిలోని చేనేతలను కలుసుకున్నారు.
మెజారిటీ సామాజిక వర్గం ఇక్కడ చేనేతలే కావడంతో వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నేరుగా వారు పనిచేసే పాకల్లోకే వెళ్లిన నారా బ్రాహ్మణి.. వారి పనితీరును తెలుసుకున్నారు. అదేవిధంగా వారు రోజుకు ఎంత గడిస్తారు? వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న నేస్తం’ పథకంపైనా బ్రాహ్మణి ఆరా తీశారు. ఈ పథకం కింద ఎంతమందికి ఎంత వస్తోందని.. అని అడిగారు. అయితే.. వైసీపీ నాయకులకు జై కొట్టిన వారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారని మెజారిటీ చేనేతలు తెలిపారు.
ఇలా.. సుమారు 20 మంది చేనేతల ఇళ్లకు తిరిగిన నారా బ్రాహ్మణి.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్‌ను గెలి పించాలని, చంద్రబాబు సీఎం అయితేనే.. మన జీవితాల్లో మార్పు వస్తుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఆమె వివరించారు. అనేక మందికి చేతి వృత్తుల పనిముట్లు అందించామన్నారు. నేత కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు మహిళలకు ఆర్థిక సాయం అందించారు.
కాగా, గత ఎన్నికల సమయంలోనూ నారా బ్రాహ్మణి.. నారా లోకేష్ కోసం .. ఇక్కడ ఇంటింటి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తన తండ్రి బాలయ్యతోనూ కలిసి ఆమె ప్రచారరథంపై ఎక్కి ప్రచారం చేశారు. తర్వాత.. తన అత్తగారు, నారా లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరితోనూ కలిసి ప్రచారం చేశారు. కానీ, ఇలా ఎన్నికలకు ముందు రావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.