తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా.. జ‌గ‌న్‌దే భారం!

రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు. ఆత్మ‌హ‌త్యలే ఉంటాయి. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారే ప‌డుతుంటారు. సొంత నిర్ణ‌యాలు అన్ని సంద‌ర్భాల్లోనూ క‌లిసి రావు. ఇప్పుడు ఈ ప‌రిస్థితే.. వైసీపీలోనూ ఎదుర‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. సామాజిక వ‌ర్గాల‌ను ఓన్ చేసుకున్న వైసీపీ అధినేత‌.. వారి సూచ‌న‌ల‌ను పాటిం చారు. వారు చెప్పిన మార్పులు కూడా చేశారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. తెలిసి నిర్ణ‌యం తీసుకుంటున్నారో.. తెలియ‌క‌ నిర్ణ‌యం తీసుకుంటున్నారో తెలియ‌దు కానీ.. కీల‌క‌మైన నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడుతున్నారు.

ఎస్సీ సామాజిక వ‌ర్గం త‌న‌దేనంటారు. కానీ, వారిలోనూ కీలక‌మైన సిట్టింగుల‌ను ప‌క్క‌న పెడుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరున్న జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిని త‌ప్పించారు. నిజానికి ఆమె క‌రోనా స‌మ‌యంలో చేసిన సేవ‌కు కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. గ్రామీణ స్థాయిలో మంచి పేరు కూడా ఉంది. పోనీ.. అక్ర‌మాలు చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయ‌ని అంటే.. అవి లేనివారు అంటూ లేరు. కానీ, ప్ర‌జాబ‌లం రూపంలో తీసుకుంటే జొన్న‌ల‌గ‌డ్డ‌కే మొగ్గు క‌నిపిస్తోంది.

ఇక‌, బీసీ సామాజిక వ‌ర్గంలో ఎప్ప‌టి నుంచో పార్టీకి అండ‌గా ఉన్న‌.. జంగా కృష్ణ‌మూర్తిని రోడ్డున ప‌డేశార‌నే వాద‌న ఉంది. నిజానికి ఆయ‌న టికెట్ కోరుకున్నారు. అయితే.. సానుకూలంగా ఆయ‌న‌ను ఒప్పించి ఉంటే వేరేగా ఉండేది. కానీ, బ‌ల‌మైన నాయ‌కుడిని ప‌క్క‌న పెట్టారు. ఈయ‌న ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇక‌, ఎస్సీ సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న మంత్రి నాగార్జున‌ను కూడా సీటు మార్చారు. కానీ, వేమూరులో ఆయ‌న పేరు తెలియ‌నివారు లేరు. కానీ, ఇప్పుడు కొత్త ఇంచార్జ్‌ను పెట్టారు. ఇక్క‌డ కూడా రాంగ్ ఈక్వేష‌న్ అంటున్నారు.

బ్రాహ్మణ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణును త‌ప్పించారు. కానీ, ఈయ‌న రెండో సారి గెలిచేందుకు అవ‌కాశం ఉంది. అయినా.. ఆయ‌న‌ను త‌ప్పించ‌డం ఆ వ‌ర్గంలో ప్ర‌భావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు బ్రాహ్మ‌ణులు ఉన్నారు. వీరి ప్ర‌భావం కూడా వైసీపీపై ప‌డితే.. ఎంతో కొంత ఓటు బ్యాంకు గ‌ల్లంతేన‌ని అంటున్నారు. ఇక‌, యాద‌వ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న కొలుసు పార్థ‌సార‌థిని గాలికి వ‌దిలేశారు. ఇలా చెప్ప‌కొంటూ.. పోతే.. సామాజిక వ‌ర్గాల‌ను ఉద్ధ‌రిస్తున్నామ‌న్న జ‌గ‌న్‌.. కీల‌క నేత‌ల‌ను వ‌దులుకుంటే.. ముక్కు మొహం తెలియ‌ని నాయ‌కుల‌కు టికెట్‌లు ఇస్తే.. వైనాట్ 175 ఎలా సాధ్యం అన్న‌ది కీల‌క ప్ర‌శ్న.