ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎనిమిది మంది రెబల్ ఎంఎల్ఏలకు పదేపదే నోటీసులిచ్చి విచారణకు పిలుస్తున్నారు. వైసీపీ నుండి నలుగురు ఎంఎల్ఏలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న విషయం చూస్తున్నదే. టీడీపీలో చేరిన నలుగురు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చీఫ్ విప్ స్పీకర్ ను కోరారు. వెంటనే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ కూడా కోరింది.
అనర్హత వేటు విషయంలో తనకు రెండు పార్టీల నుండి లేఖలు రావటంతో మొత్తం ఎనిమిది మంది ఎంఎల్ఏలను విచారణకు రమ్మని స్పీకర్ నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే అందరికీ నాలుగైదుసార్లు నోటీసులిచ్చి విచారించారు. అయినా మళ్ళీ మరోసారి నోటీసులు ఇవ్వటమే విచిత్రంగా ఉంది. అసలు ఏమి ఆశించి స్పీకర్ ఇన్నిసార్లు వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారో అర్ధంకావటంలేదు. ఎన్నిసార్లు ఎంఎల్ఏలకు నోటీసులిచ్చినా వాళ్ళు తమ వాదనను సమర్ధించుకుంటనే ఉంటారు.
స్పీకర్ ఆలోచనలకు ఎంఎల్ఏల వాదనకు ఎక్కడా పొంతనకుదరదు. కాబట్టి ఎవరిపైన తాను అనర్హత వేటు వేయదలచుకున్నారో వాళ్ళపైన వేటు వేసేస్తే ఒక పనైపోతుంది. నిజానికి రాజ్యసభ పోలింగ్ జరిగే 27వ తేదీలోగా స్పీకర్ ఏ ఎంఎల్ఏపైనా అనర్హత వేటు వేసే అవకాశంలేదు. అనర్హత వేటు వేయాలంటే ఫిబ్రవరి 27వ తేదీ తర్వాతే వేయగలరు. మార్చి రెండోవారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
అంటే అనర్హత వేటు వేసినా నోటిపికేషన్ రిలీజ్ అయ్యే తేదీకి మధ్యలో రెండు వారాలుంటుందంతే. ఈమాత్రం దానికి అనర్హత వేటుపై విచారణ, వేటు లాంటివి ఎందుకింతగా సాగదీస్తున్నారో అర్ధంకావటంలేదు. ఎవరిపైన అనర్హత వేటు వేసినా వైసీపీ, టీడీపీలకు ఎలాంటి లాభమూ ఉండదు, నష్టమూ ఉండదు. నోటీసుల పేరుతో జరుగుతున్న తంతు అంతా ఒక ప్రొసీజరల్ డ్రామాలాగ అనుమానంగా ఉంది. మరి దీనివల్ల ఏమిటి ఉపయోగమో స్పీకర్ కార్యాలయమే చెప్పాలి.