ఈ సారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న వద్దిరాజు రవిచంద్రను మరోసారి కేసీఆర్ నామినేట్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లకు ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి.. రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. వీటిలో ఇప్పటికే రేణుకా చౌదరి సహా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. వీరి గెలుపు ఖాయం కానుంది.
ఇక, బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. నామినేషన్ల దాఖలుకు గురువారం వరకూ గడువు ఉండడంతో.. వద్దిరాజు గురువారం నామినేషన్ వేయనున్నారు. వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి ధపాలో రెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
మేనల్లుడికి లోక్‌సభ?
కాగా, ప్రస్తుతం రాజ్యసభ సీటు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 2న రిటైర్ అవుతున్న జోగినపల్లి సంతోష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారు. ఈయన సాక్షాత్తూ.. కేసీఆర్‌కు మేనల్లుడు. పైగా.. ఢిల్లీలో కావాల్సిన వ్యక్తుల్లో చాలా ముఖ్యుడు. ఈ దఫా ఈయనను లోక్‌సభకు పంపించే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తారన్న నియోజకవర్గాన్ని ఈయనకు కట్టబెట్టడం ఖాయమని అంటున్నాయి. కావాల్సిన వారిలో సంతోష్ ఒకరు కావడం.. ఆయనను వదులుకునేందుకు కేసీఆర్ ఇష్టపడరని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను లోక్‌సభకు పంపించడం ఖాయమని, అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పించారని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates