కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై దుమారం.. రేవంత్ ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. మాజీ సీఎం, బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్.. “ఏం పీక‌నీకి పోయినవ్‌” అంటూ.. సీఎంను విమ‌ర్శించ‌డాన్ని.. ముఖ్య‌మంత్రి రేవంత్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. ఇదేనా సంప్రదాయం.. అంటూ నిల‌దీశారు. ఇప్ప‌టికే 4 కోట్ల మంది ప్ర‌జ‌లు కేసీఆర్ ఫ్యాంటు ఊడ‌బీకార‌ని.. ఇక‌, మిగి లిన అంగీని కూడా లాగేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని సీఎంరేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో స‌భ‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ సభ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం జ‌రిగింది.

ఏం జ‌రిగిందంటే..

మంగ‌ళ‌వారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ సభలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. “మేడిగడ్డ ద‌గ్గ‌ర‌కు ఎందుకు పోయిండో తెల్వ‌దు. ఏం పీక‌నీకి పోయిండో తెల్వ‌దు. కానీ, పోయిన్రు. ఇదీ.. కాంగ్రెస్ పాల‌న‌. సూర్యుడి లెక్కున్న నాపై దుమ్ము పోయాల‌ని చూస్తున్రు” అని కేసీఆర్ అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను అసెంబ్లీలో బుధ‌వారం ప్ర‌స్తావించిన రేవంత్ రెడ్డి.. రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా చేసి, నాలుగు సార్లు పార్ల‌మెంటుకు వెళ్లి, కేంద్ర మంత్రిగా చేసిన వ్య‌క్తి ఇలానా.. మాట్లాడేది? అంటూ.. ఫైర్ అయ్యారు. అంతేకాదు..”కాళేశ్వరం అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతరా అంటూ ప్రశ్నిస్తున్నారు.కేసీఆర్ చచ్చిన పాము. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది” అని ప్ర‌శ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడినా కూడా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా అని సభలో ప్రశ్నించారు. మేడిగడ్డలో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారని గుర్తుచేస్తూ.. మొన్నటి వరకు ఆ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రులకే ఆ బాధ్యత అప్పగిస్తామని, ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.