తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు జల వివాదాల్లో తలమునక లయ్యారు. ఒకరిపై ఒకరు అసెంబ్లీలో సోమవారం తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు పోరుబాటను రోడ్డెక్కించారు. ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు చేపట్టాయి. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. ‘చలో మేడిగడ్డ’ నినాదంతో కాంగ్రెస్.. ‘చలో నల్గొండ’ నినాదంతో బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాలకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. దీనికి ప్రత్యేకంగా అరడజను పైగా బస్సులు పెట్టారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కు కూడా రేవంత్ ఆహ్వానం పలికారు. కేసీఆర్ వస్తానంటే.. హెలికాప్టర్ పెడతామని వ్యాఖ్యానించా రు. అయితే.. బీఆర్ ఎస్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో కాంగ్రెస్ నేతలను తీసుకుని సీఎం రేవంత్ మేడిగడ్డకు చేరుకున్నారు.
ఇక, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం నల్గొండకు చేరుకుంది. ఈ బృందానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ కూడా రానున్నారు. తెలంగాణ నదీ జలాలపైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ నుంచి ‘’చలో నల్గొండ’’ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు బయలుదేరారు.
అటు వైపు మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలను ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. అసెంబ్లీ లో ఓ రేంజ్‌లో బీఆర్ ఎస్‌పై విమర్శలు గుప్పించిన.. ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపించేందుకు రెడీ అయ్యారు. అదేసమయంలో బీఆర్ ఎస్ పాలనలో ఏం చేశామనేది చెప్పడానికి ఆ పార్టీ నల్లగొండను కేంద్రంగా చేసుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.