‘రెడ్ బుక్’ వ్యవహారంపై టీడీపీయువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. “నా రెడ్ బుక్‌లో పేటీఎం కుక్కల పేర్లు కూడా ఉన్నాయి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా టీడీపీ -జనసేన ప్రభుత్వం రాగానే జగన్ విశాఖలో కట్టుకుంటున్న ఇంటిని ప్రజాభవన్‌గా మారుస్తామని అన్నారు. శంఖారావం పేరిట నిర్వహిస్తున్న సభల్లో తాజాగా ఆయన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
“జగన్ జైలుకెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడింది. అదే చంద్రబాబు జైలుకు వెళ్తే ఆయన చేసిన మంచి పనులు బయటికి వచ్చాయి. జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తాడు. వైఎస్ఆర్ సీపీకి అంతిమయాత్ర మొదలైంది. షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తుంటే పేటీఎం కుక్కలు ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. పేటీఎం కుక్కల పేర్లు కూడా నా రెడ్ బుక్ లో ఉన్నాయి. ఎన్నికల తర్వాత జగన్ పక్క రాష్ట్రానికి పారిపోతాడు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి” అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విశాఖలో సీఎం కట్టే ఇంటిని ప్రజాభవన్‌గా మారుస్తామని నారా లోకేష్ చెప్పారు. “సీఎం జగన్ విశాఖపట్నంలో కట్టుకున్న ప్యాలెస్‌ను మేం అధికారంలోకి రాగానే ప్రజా భవన్‌గా మారుస్తాం. విశాఖ ఉక్కు ప్లాంటుపై జగన్ నక్క వినయాలు చూపుతున్నాడు. మేం అధికారంలోకివస్తే.. అవసరమైతే విశాఖ ఉక్కు ప్లాంటును మేమే కొనుగోలు చేస్తాం” అని నారా లోకేష్ అన్నారు.
టీడీపీ పాలిచ్చే ఆవు!
టీడీపీని నారా లోకేష్ పాలిచ్చే ఆవుతో పోల్చారు. “మనం ఎప్పుడూ తన్నే దున్నపోతు జోలికి వెళ్లం. ఎందుకంటే దగ్గరికి వెళ్తే అది తంతుంది కాబట్టి. కాని పాలిచ్చే ఆవు దగ్గరికి మాత్రం వెళ్తాం. ఇంకా కొంచెం ఎక్కువ పాలివ్వమని అడుగుతాం. ఇక్కడ తన్నే దున్నపోతు వైసీపీ ప్రభుత్వం.. పాలిచ్చే ఆవు తెలుగు దేశం పార్టీ” అని లోకేష్ అన్నారు. ఇక, ఉదయం నుంచి మూడు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో తాము అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలను నారా లోకేష్ వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates