తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందా ? పార్టీ, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి బోలెడు కారణాలున్నాయి. అవేమిటంటే తెలంగాణాలో తొందరలోనే భర్తీ అవ్వబోయేది మూడు రాజ్యసభ ఎంపీ స్ధానాలు. అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం రెండు కాంగ్రెస్ కు ఒకటి బీఆర్ఎస్ కు రావటం ఖాయం. మూడోసీటును కూడా దక్కించుకోవాలంటే అందుకు కాంగ్రెస్ చాలా కష్టపడాల్సుంటుంది. అయితే ఎంత కష్టపడినా మూడోస్ధానం దక్కేంతవరకు గ్యారెంటీ లేదు.
కాబట్టి రెండుస్ధానాలపైనే ఇపుడు దృష్టిపెట్టింది. పార్టీకి ఖాయంగా దక్కబోయే స్ధానాలు ఎవరికి దక్కుతాయనే విషయంలోనే సీనియర్ నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే ఉన్న రెండుస్ధానాల కోసం చాలామంది సీనియర్లు పోటీపడుతున్నారు. రేణుకా చౌదరి, వీ హనుమంతరావు, జానారెడ్డి, చిన్నారెడ్డి, సర్వే సత్యానారాయణ, మధుయాష్కి గౌడ్ లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. వీళ్ళ పేర్లును పక్కనపెట్టేస్తే రెండు సీట్లలో ఒకటి అధిష్టానం తీసుకుంటోందనే చావు కబురు చల్లగా బయటపడింది. దీంతో తెలంగాణాకు దక్కే అవకాశం ఒక్కటే సీటనే వార్త చక్కర్లు కొడుతోంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కోటాలో ఇతర రాష్ట్రాల నుండి కొందర సీనియర్లను రాజ్యసభకు పంపంటం ఎప్పటినుండో ఉన్నదే. అలాగే ఇపుడు కూడా ఒక సీటును ఏఐసీసీ తన కోటాలో తీసుకోవటం ఖాయమని ప్రచారం పెరిగిపోతోంది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మను సింగ్వి, ముకుల్ వాస్నిక్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనటే పేర్లు వినబడుతున్నాయి. ఏఐసీసీ కోటాలో ఒక సీటు పోతే మిగిలిన ఒక్క సీటు కోసం తీవ్రస్ధాయిలో పోటీ పెరిగిపోవటం ఖాయం. అందుకనే తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. నామినేషన్ల దాఖలకు 15వ తేదీ గడువు.
అంటే ఇక మిగులున్నది రెండు రోజులు మాత్రమే. ఈ రెండు రోజుల్లోనే ఏఐసీసీ కోటా ఎవరికో తేలాలి, తెలంగాణాలో లక్కీ నేతెవరో చూడాలి. రాకరాక పదేళ్ళ తర్వాత వచ్చిన రాజ్యసభ ఎంపీల నామినేషన్ అవకాశాన్ని ఏఐసీసీ కోటాలో అధిష్టానం ఒకటి తీసేసుకోవటాన్ని తెలంగాణా నేతలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయితే బయటకు ఏమి మాట్లాడలేకపోతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.