ప‌వ‌న్ అసెంబ్లీలో అడుగు పెడితే..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అసెంబ్లీలోకి అడుగు పెడ‌తారా? ఆయ‌న అడుగు పెడితే ఎలా ఉం టుంది? కొన్నాళ్లుగా ఏపీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. ముఖ్యంగా జ‌న‌సేన నాయ‌కుల్లో ఈ చ‌ర్చ ఎక్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం సినీ రంగానికి చెందిన ఒక్క బాల‌కృష్ణ టీడీపీ త‌ర‌ఫున‌, వైసీపీ నుంచి మంత్రి రోజాలు మాత్ర‌మే స‌భ‌లో ఉన్నారు. రోజా దాదాపు సినిమాలు మానేసిన నేప‌థ్యంలో ఆమె పూర్తిగా రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.

ఇక‌, బాల‌య్య మాత్రం రెండు ప‌డ‌వ‌ల‌పైనా నిర్విఘ్నంగా ప్ర‌యాణిస్తున్నారు. అసెంబ్లీలోనూ, సినిమాల్లో నూ ఆయ‌న త‌న‌దైన శైలిలో దూకుడుగా ఉన్నారు. వైసీపీకి వ్య‌తిరేకంగా కామెంట్లు చేయ‌డంలోనూ బాలయ్య స్ట‌యిలే వేరుగా ఉంది. ఇక‌, ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పవ‌న్ కూడా.. అసెంబ్లీలో అడుగు పెడితే బాగుంటుంద‌ని.. ఈ సారి ఖాయ‌మ‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న వాగ్ధాటి, సిద్ధాంతాలు వంటివి అసెంబ్లీకి ఎంతో ఉప‌క‌రిస్తాయ‌ని వారు అంటున్నారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌సంగాలు.. విన‌సొంపుగా ఉండ‌డ‌మే కాకుండా.. ఆలోచ‌నాత్మ‌కంగా ఉంటున్నాయ‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్.. రెండు చోట్లా ఓడిపోయారు. కానీ.. ఈ సారి మాత్రం గెలుపు ఖాయ‌మ‌నేది జ‌న‌సేన నాయ‌కుల టాక్‌. దీంతో ఆయ‌న అసెంబ్లీకి వ‌స్తే.. ప్ర‌భుత్వం త‌మ‌దైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీదే అయినా.. ఒక స‌మంజ‌స‌మైన చ‌ర్చ‌ల‌కు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు స‌భ వేదిక‌య్యే అవ‌కాశం ఉంటుంద‌నేది జ‌న‌సేన నాయ‌కుల మాట‌.

ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ ఓవ‌ర్గం వారు.. ప‌వ‌న్ పార్టీ ఎలా ఉన్నా…ఆయ‌న స‌భ‌లో ఉంటే బాగుంటుంద‌నే వాద‌న‌ను వినిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల‌మేరకు తిరుప‌తి నుంచి ప‌వ‌న్ పోటీ ఖాయంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఈ దఫా అన‌కాప‌ల్లిని ఆయ‌న ఎంచుకోనున్నారు. ఈ రెండు చోట్ల గెలిస్తే.. తిరుప‌తిని ఉంచుకునే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. ఆయ‌న అసెంబ్లీలో అడుగు పెట్ట‌డం ఖాయ‌మ‌ని జ‌న‌సేన అంచ‌నా వేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.