పొత్తులు.. ఇప్పుడు దేశంలో ఎటు చూసినా.. ఎక్కడ విన్నా ఈ మాటే వినిపిస్తోంది. ఒక్క కాంగ్రెస్, ఎంఐ ఎం వంటి పార్టీలు మినహా.. ఏ పార్టీ కలిసి వచ్చినా.. చెంతకు చేర్చుకునేందుకు చంక ఎక్కించుకునేందు కు బీజేపీ తహతహలాడుతోంది. “కుటుంబ నియంత్రణ వ్యక్తులకే. సంఖ్యాబలం తగ్గించుకునేందుకే. కానీ, పార్టీలకు కుటుంబ నియంత్రణ వర్తించదు. ఎంత మంది ఉన్నా.. అంత లాభం“ అని కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్లడించారు.
దీంతో ఇంకేముంది.. టీడీపీ.. సహా ఆర్ ఎల్‌డీ(యూపీకి చెందిన పార్టీ), అకాలీదళ్(పంజాబ్ పార్టీ), జేడీ యూ(కర్ణాటకకు చెందిన పార్టీ)ఇలా.. అనేక పార్టీలు తమతో బీజేపీ చేతులు కలిపేందుకు రెడీ అయింద ని.. సంబరాలు చేసుకుంటున్నారు. కానీ.. వాస్తవ అవసరం ఎవరిది? అనేది కొంత తెరదీసి చూస్తే.. ఖచ్చితంగా మోడీ మాన్యులదేనని స్పష్టంగా తెలుస్తుంది. పొత్తు అవసరం.. ఈ చిన్నా చితకా పార్టీలకు పెద్దగా అవసరం ఉందో లేదో తెలియదు కానీ.. బీజేపీకి మాత్రం కడు అవసరంగా మారింది.
ఎందుకంటే.. కేంద్రంలో ఈ దఫా కూడా.. అధికారంలోకి వచ్చి మూడోసారి పగ్గాలు చేపట్టి దేశాన్ని ఏలాల నేది మోడీ వారి ఆలోచన. అయితే.. ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే.. తామే ఒంటరిగా అధికారం లోకి వచ్చేంత 370 సీట్లను సంపాయించుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి పార్టీ.. ఇప్పుడు పొత్తుల కోసం.. ఎత్తులు వేయాల్సిన అవసరం ఉందా? అంటే.. ఉంది! ఎందుకంటే.. కాంగ్రెస్‌ను మరింత బలహీనం చేయాల్సిన లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి.
మూడో సారి కూడా అధికారంలోకి వచ్చాక.. తమదైన అజెండాను అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి.. ప్రతిపక్షాల బలాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించడమే ప్రస్తుతం మోడీ, అమిత్‌షాల ప్రధాన వ్యూహం. “ఎక్కువ మంది ప్రతిపక్షాలు ఉంటే.. అది మా చెవిలో జోరీగగానే ఉంటుంది!“ అని సభలోనే కేంద్ర మంత్రి తోమర్ గతంలో వ్యాఖ్యానించిన సందర్భం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆయనేమీ ఊరికేనే అనలేదు. ఆయన వ్యవసాయ మంత్రిగా అప్పట్లో ఉన్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన దరిమిలా.. ఆయన సభలో చేసిన వ్యాఖ్య ఇది. సో.. ఈ సూత్రమే ఇప్పుడు బీజేపీ అవలంభిస్తోంది. అందుకే.. సాధ్యమైనంత వరకు ప్రతిపక్షాలను మచ్చిక చేసుకుని.. ముందరి కాళ్లకు బంధాలు వేయడం ద్వారా.. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడంతోపాటు.. తమ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడమే ఈ పొత్తుల వెనుక ఉన్న పరమార్థం!!