రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులో జనసేన పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చేసింది. జనసేనకు 25 సీట్ల వరకు కేటాయించ్చచనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే సడెన్ డెవలప్మెంట్ గా బీజేపీ సీన్ లోకి వచ్చింది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా చేరే అవకాశాలున్నాయని సమాచారం. సరే, బీజేపీ విషయాన్ని పక్కన పెట్టేసినా జనసేన కోరుకుంటున్న నియోజకవర్గాల జాబితాను పవన్ అయితే చంద్రబాబునాయుడుకు ఇచ్చేశారు. ఆ జాబితాను చంద్రబాబు దాదాపు ఓకే చేసినట్లే పార్టీ వర్గాల టాక్.
ఇపుడు విషయం ఏమిటంటే కడప జిల్లాలో ఒకే ఒక్కస్ధానంలో జనసేన పోటీచేయబోతోందట. ఆ ఒక్క నియోజకవర్గం రాజంపేటట. రాజంపేటను తమకు కేటాయించాలని పవన్ అడగటం, చంద్రబాబు ఓకే చెప్పటం కూడా అయిపోయిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి టికెట్ రేసులో నుండి సీనియర్ తమ్ముళ్ళు తప్పుకోవాల్సిందే తప్పవేరే దారిలేదు. బత్యాల చెంగల్ రాయలు, నరహరి ఎప్పటినుండి టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకపుడు నరహరిని రాజంపేట ఎంపీగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తర్వాత ఏమైందో ఏమో సీనంతా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం రాజంపేటలో జనసేన పోటీచేయబోతోంది. పార్టీ తరపున పోటీచేయటం కోసం యల్లటూరు శ్రీనివాసరాజు, ఏ దినేష్ టికెట్ రేసులో ఉన్నారు. శ్రీనివాసరాజు చాలాకాలంగా పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వర్గాలను కలుస్తు మద్దతు కోరుతున్నారు. దినేష్ ఈమధ్యనే టికెట్ రేసులోకి వచ్చారు.
ముందు ఎవరొచ్చారు తర్వాత ఎవరొచ్చారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇద్దరు మంచి పట్టుమీద టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నది వాస్తవం. నియోజకవర్గంలో మొదటి నుండి బలిజలు (కాపు), రాజుల సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటోంది. పక్కనే ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నా నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయిపోయింది. అందుకనే రైల్వేకోడూరులోని రాజులు కోడూరుతో పాటు రాజంపేట మీద కూడా దృష్టిపెట్టున్నారు. అందుకనే బలిజలతో పాటు రాజుల ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి రాజంపేటను అధికారికంగా జనసేనకు ఎప్పుడు కేటాయిస్తారు ? పవన్ టికెట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates