అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించబోతున్న బహిరంగసభను కేసీయార్ బాగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈనెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగసభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే బీఆర్ఎస్ సత్తా ఏమిటో చాటాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అసెంబ్లీలో అయినా బహిరంగసభలో అయినా ప్రధాన ప్రచార అస్త్రం జలవనరుల ప్రాజెక్టులే అని అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీయార్ వేలకోట్ల రూపాయలు దోపిడి చేశారని రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు.
తమ ఆరోపణలు ఉత్త ఆరోపణలు మాత్రమే కావని సాక్ష్యాలున్నాయని రేవంత్, మంత్రులు చెబుతున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరిగిన దోపిడిని నిరూపించేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. తాజాగా విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, పరిరక్షణ బాధ్యతలను రేవంత్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ)కి అప్పగించింది. నీటి ప్రాజెక్టులు, ప్రాజెక్టుల నిర్మాణంపై రేవంత్ కు సరైన విధానంలేదని కేసీయార్ అండ్ కో మండిపోతున్నారు.
కేఆర్ఎంబీ కి బాధ్యతలు అప్పగించటం వల్ల తెలంగాణాలో సగభాగం ఎడారిగా మారబోతోందనే ఆరోపణలతో రాష్ట్రమంతా కేసీయార్ ప్రచారం చేయబోతున్నారు. అందుకనే మొదటిసభను నల్గొండలో నిర్వహించబోతున్నారు. ఈ సభకు తక్కువలో తక్కువ 2 లక్షలమందిని సమీకరించాలని ఆదేశించారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుండి జనాలను తీసుకురావాలని ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలను ఇన్చార్జిలుగా నియమించారు. జనసమీకరణ బాధ్యతలను పూర్తిగా వీళ్ళకే అప్పగించారు.
ప్రతి నియోజకవర్గం నుండి 20 వేలకు తక్కువ కాకుండా సమీకరించాలని సమీక్షా సమావేశాల్లో కేసీయార్ పదేపదే చెబుతున్నారు. మొదటి బహిరంగసభను గ్రాండ్ సక్సెస్ చేయటం ద్వారా పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని బ్రహ్మాండంగా మొదలుపెట్టాలన్నది కేసీయార్ ఆలోచన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ అండ్ కో, రేవంత్ అండ్ కో ప్రస్తావిస్తున్నది ఒకటే అంశం అది జలవనరులు. కాకపోతే ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీయార్ అండ్ కో వేల కోట్ల రూపాయలు దోచేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో నీటి వనరులపై ప్రభుత్వం కేఆర్ఎంబీకి బాధ్యతలు అప్పగించటం వల్ల తెలంగాణా ఎడారి కాబోతోందని కేసీయార్ అండ్ కో ఆరోపిస్తున్నారు.