జనసేన పార్టీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. దాదాపు పదేళ్ళుగా పార్టీ జెండా మోసిన నేతలు, కష్టనష్టాలను ఎదుర్కొన్న నేతల కన్నా కొత్తగా చేరిన వాళ్ళ హడావుడి ఎక్కువైపోయింది. విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తుతో జనసేన పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని సీట్లలో జనసేన పోటీచేస్తుంది ? పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవనే విషయం అధికారికంగా ప్రకటనకాలేదు. అయితే మీడియాలో లీకుల రూపంలో కొన్ని నియోజకవర్గాలు జాబితా చక్కర్లు కొడుతోంది. అందులో జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాలు ఇవే అని లిస్టు వైరల్ అయ్యింది.
అందుకనే ఆ జాబితాలోని నియోజకవర్గాల్లో హడావుడి బాగా పెరిగిపోతోందట. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రయారిటి అంతా ఉభయగోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ జిల్లాకు ఇస్తున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే విశాఖపట్నంలో పార్టీ పోటీచేస్తుంది అని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో కొత్తగా చేరిన నేతల జోష్ పెరిగిపోతోంది. దీంతో పదేళ్ళుగా పార్టీ జెండాలను మోసిన వాళ్ళు బిక్కమోహం వేస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో చాలాకాలంగా బోడపాటి శివదత్ పనిచేస్తున్నారు. కాబట్టి సహజంగానే టికెట్ ఆశిస్తున్నారు.
అయితే వారాహియాత్ర సందర్భంగా మాజీ ఎంఎల్సీ శివకుమారి పార్టీలో చేరారు. చేరిన దగ్గర నుండి నియోజకవర్గంలో హడావుడి చేస్తు కొందరు కీలకమైన నేతలతో తరచు సమావేశమవుతున్నారు. దాంతో టికెట్ కోసం ఆమెకు మద్దతు పెరిగిపోతోంది. టికెట్ రేసులో శివకుమారి దూసుకుపోతుండటంతో శివదత్ కు ఏమిచేయాలో అర్ధంకావటంలేదు. పెందుర్తి నియోజకవర్గంలో చాలాకాలంగా రాష్ట్రప్రధాన కార్యదర్శిగా శివశంకర్ ఇన్చార్జిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ తానే నిర్వహిస్తున్నారు కాబట్టి సహజంగానే టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈమధ్యనే పార్టీలో చేరిన మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ కే టికెట్ అనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఎందుకంటే అసలు టికెట్ హామీతోనే రమేష్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే వీళ్ళిద్దరి షాక్ ఇచ్చే రీతిలో ఈమధ్యనే పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ కంచిపాటి విశ్వనాధనాయుడు పార్టీలో చాలా హడావుడి చేస్తున్నారు. టికెట్ పై పవన్ నుండి హామీ పొందిన తర్వాతే 15 రోజుల క్రితం పార్టీలో చేరినట్లు ప్రచారం జరగుతోంది. దాంతో టికెట్ ఎవరికి అన్న విషయంలో గందరగోళం పెరిగిపోతోంది. విశాఖపట్నం ఉత్తరం, దక్షిణంతో పాటు గాజువాక నియోజకవర్గాల్లో కూడా సేమ్ టు సేమ్. కొత్తగా చేరిన నేతల హడావుడితో పార్టీలో అయోమయం పెరిగిపోతోంది. అసలు జనసన పోటీచేయబోయే నియోజకవర్గాలు ఎన్ని అని తేలకుండానే హడావుడి మాత్రం పెరిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates