రాజకీయాలు అన్న తర్వాత ఖర్చులు సర్వసాధారణం. వాటిని భరించేందుకు వీలుగా విరాళాలు.. పార్టీ ఫండ్ ఇలా వేర్వేరు పేర్లతో నిధుల సమీకరణ ఉంటుంది. ఇదంతా కామన్. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అంతేకాదు.. విరాళాల పేరుతో చెక్కులు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో టికెట్లకు గాలం వేసే వారికి దిమ్మ తిరిగేలా షాకిస్తున్న వైనం సంచలనంగా మారింది.
తాజాగా తనను కలిసి పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లుగా చెక్కులు ఆయన చేతికి ఇచ్చారు. అనంతరం జనసేన టికెట్లు కావాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన పవన్ వారికి.. వారిచ్చిన చెక్కుల్ని తిరిగి ఇచ్చేయటమే కాదు.. తనకు చెక్కుల అవసరం లేదని తేల్చేయటం గమనార్హం.
ఇటీవల కాలంలో చెక్కులు చేతికి ఇచ్చి టికెట్లు కోరుతున్న వారి సంఖ్య పెరటం.. గతంలో తాము పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చినట్లుగా పేర్కొంటూ.. అందుకు బదులుగా తమకు టికెట్లను కన్ఫర్మ్ చేయాలని కోరుతున్న ఆశావాహులకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. మీ విరాళాలు నాకొద్దు.. టికెట్ కోసం విరాళాలు ఇచ్చి ఉంటే.. మీరు ఇచ్చిన విరాళాల్ని తీసుకెళ్లిపోవాలంటూ పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు.. పార్టీకి సంబంధించి ఎవరైనా చెక్కులు ఇవ్వటం.. విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చేసి.. ఆ తర్వాత టికెట్ అడితే వారిని అస్సలు ప్రోత్సహించొద్దంటూ స్పష్టమైన ఆదేశాల్ని పార్టీ నేతలకు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మాటల్లోనే కాదు.. ఇప్పటికే కొన్ని చెక్కుల్ని తిరిగి పంపించినట్లుగా చెబుతున్నారు. ఈ వైఖరి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి పార్టీ అధినేత తెలుగు రాజకీయాల్లో చూడలేదన్న మాట వినిపిస్తోంది.