ఎస్సీల దిశ‌గా జ‌గ‌న్ అడుగులు.. రెండు పెద్ద స్థానాలు వారికే!

ఎస్సీల‌కు మ‌రింత పెద్ద‌పీట వేసే దిశ‌గా సీఎం జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఒక‌వైపు కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌, మ‌రోవైపు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ఎస్సీల‌కు అన్యాయం చేస్తున్నారంటూ.. ప్ర‌చారం చేస్తున్న ద‌రిమిలా.. ఆ ఓటు బ్యాంకును ప‌దిలంగా కాపాడుకునే ల‌క్ష్యంతో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్య‌సభ సీట్ల‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక స్థానాన్ని మాత్ర‌మే ఎస్సీల‌కు కేటాయించిన ఆయ‌న ఇప్పుడు రెండుస్థానాల‌ను వారికే కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

తాజాగా మ‌రోసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. ఇప్ప‌టి వ‌రకు ఈ మూడు స్తానాల్లో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు(ఎస్సీ) పేర్లను ఖరారు చేసినట్లు కొన్నాళ్ల కింద‌ట వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించే ఈ నిర్ణ‌యంపై జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గార‌ని తెలిసింది. ఒక రెడ్డి నాయ‌కుడిని ప‌క్క‌న పెట్టి మ‌రో ఎస్సీని ఈ జాబితాలో చేర్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఇంతకు ముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఓ సీటును ఖరారు చేశారు. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా చిత్తూరులో రెడ్డి వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ కేటాయించారు. ఈ కారణంగా ఆయనకు రాజ్యసభ ఇస్తారనుకున్నారు. కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథరెడ్డికి కేటాయించారు. ఇక‌, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నందున రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయం అవకాశం కనిపిస్తోంది.

ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. అదే రోజున మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ కూడా జరగబోతోంది. ఈ నేప‌థ్యంలో రెండు ఎస్సీల‌కు ఇచ్చి.. ఒక‌టి మాత్ర‌మే రెడ్డి వ‌ర్గానికి ఇవ్వ‌డం ద్వారా.. ఎస్సీల‌కు త‌మ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వైసీపీ ప్ర‌చారం చేసుకునేలా క‌నిపిస్తోంది. ఎక్కువ మంది రిజర్వుడు నియోజకవర్గాల వారికి టిక్కెట్లు మారుస్తున్నారు. ఈ కారణంగా ఇద్ద‌రు ఎస్సీల‌ను పోటీకి పెడితే.. ఎస్సీ ఎమ్మెల్యేలంతా త‌మ‌వైపే ఉంటార‌న్న‌ది వైసీపీ వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.