టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ జాడ ఎక్కడ? ఆయన ఏం చేస్తున్నారు? రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. యువగళం పాదయాత్ర తర్వాత.. ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాడిపోతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చారు. పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి. కుటుంబ సమేతంగా పూజలు చేశారు. తర్వాత.. మంగళగిరి నియోజకవర్గంలో తన వర్గాన్ని కలిశారు.
ఇంతకు మించి.. నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమయ్యారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి నాయకులు బయటకు రావాలని అనుకుంటున్న సమయం లో వారికి దిశానిర్దేశం చేస్తున్నారని.. పార్టీలో వారి బాధ్యతలు వివరిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి నారా లోకేష్ రెండు షెడ్యూళ్లు ప్రకటించారు. దీనిని పార్టీ నాయకులు ప్రచారం కూడా చేశారు. ఒకటి.. మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం ద్వారా. ప్రజలకు చేరువ కావడం.
తద్వారా.. నియోజకవర్గంలో గెలిచి తీరాలన్న తన తపనను సాకారం చేసుకోవాలని నారా లోకేష్ భావించారు. అయితే.. అనివార్య కారణాలతో దీనిని చేయలేదు. ఇక, ఈ నెల 5 వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో నారా లోకేష్ పర్యటనలు సాగాల్సి ఉంది. యువగళం పాదయాత్ర సందర్భంగా.. ఆయన కవర్ చేయని జిల్లాల్లో యువగళం సభలు పేరుతో కవర్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.
5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కూడా నారా లోకేష్ షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. అనూహ్యంగా ఆయన పర్యటనలు మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దు బాటు.. ఇతరత్రా నిధుల ఏర్పాటు.. ఐటీడీపీని మరింత బలోపేతం చేయడం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. మరి విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది
Gulte Telugu Telugu Political and Movie News Updates