వైసీపీ ఎమ్మెల్యే, మైలవరం నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్.. ఓపెన్ అయిపోయారు. త్వరలోనే ఆయన పార్టీకిగుడ్ బై చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా మైలవరం సమన్వయ కర్తగా తిరుపతిరావును నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వసంత కృష్ణ ప్రసాద్‌తన అనుచరులు, శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబును పదే పదే తిట్టాలని, వారిని డ్యామేజీ చేసేలా కామెంట్లు చేయాలని సీఎంజగన్ తనపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిపారు.
అయితే, తాను మృదు స్వభావినని, తన తండ్రి నాగేశ్వరరావు రాజకీయాలనే తాను కూడా పుణికి పుచ్చుకున్నానని.. కాబట్టి అనవసరంగా ఒకరిపై నోరు పారేసుకోలేనని తేల్చి చెప్పినట్టు తెలిపారు. అందుకే తనకు సీఎం అప్పాయింట్ మెంటు ఇవ్వడం మానేశారని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు. ఒకే ఒక్కసారి మైనింగ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినిపించుకున్నారని, కానీ.. ఆయన కూడా ఏమీ చేయలేక పోయారని తెలిపారు.
“నేను నా అనుచరులను తీసుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించా. కానీ..నన్ను అడ్డుకున్నారు. కనీసం మొహం కూడా చూసేందుకు ఇష్టపడలేదు. చాలా బాధపడ్డా.” అని వసంత వ్యాఖ్యానించారు. పార్టీలో ఇమడగలిగే పరిస్థితి లేదని చెప్పినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గాన్ని కొందరు కబ్జా చేశారని.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తాను నియోజకవర్గంలోని కొంత భాగానే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు.
మైలవరం నుంచి పెడన వెళ్లిన ఓ నేత.. ఇక్కడ గ్రూపులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారని అన్నారు. 2014లో మైలవరంలో ఓడిపోయిన నాయకుడు.. తనపై పెత్తనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనను ప్రశాంతంగా పనిచేయ నీయలేదన్నారు. ఏడాదిన్నరగా తనను ఇబ్బందులకు గురి చేశారని వసంత వ్యాఖ్యానించారు. ఎన్నోసార్లు పార్టీ మారబోనని చెప్పాన్నారు. కానీ, సొంత పార్టీ నేతలే తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. తన భవిష్యత్తును త్వరలోనే చెబుతానన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates