వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. “పొత్తులో భాగంగా తీసుకునే ప్రతి సీటు వెనుక ఎవరో ఒకరి త్యాగం ఉంటుందని.. కాబట్టి, ఏ ఒక్కసీటునూ ఓడిపోవడానికి వీల్లేదు” అని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ మిత్రపక్షం బలమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఆయన తెలిపారు. అయితే, ఈ విజయం తేలికగా రాదన్నారు. బలమైన పోరాటం అవసరమని, జన సైనికులు దానికి సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
“శత్రువు ఎన్ని మోసాలతో అయినా మళ్లీ అధికారంలోకి రావడానికి పన్నాగాలు పన్నుతాడు. జగన్ మోసాలను జయించి విజయం సాధించాలి. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో జనసేన బలమైన ముద్ర వేయాలి” అని పవన్ వ్యాఖ్యానించారు. “నేను సైలెంటుగా ఉన్నాను… అంతా నిస్తేజంగా ఉందని జనసైనికులు, వీర మహిళలు అనుకోవద్దు. ప్రతి మౌనం వెనుక బలమైన వ్యూహం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి చోట కచ్చితంగా గెలుపు ఉండాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసిన దగ్గర గెలిచి తీరాల్సిందే” అని అన్నారు.
జగన్ దుర్మార్గ ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించడం అసాధ్యమని పవన్ హెచ్చరించారు. ఐదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి ఇంత దిగజారిపోతే.. మరోసారి జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా ఏమీ ఉండదన్నారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. స్ధానిక సంస్ధల స్థాయి పదవులు నుంచి రాష్ట్ర స్థాయి పదవులు వరకు అందరికీ.. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరినీ మరిచిపోయేది లేదన్నారు. ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు. పడిన ప్రతీ కష్టానికీ తగిన గౌరవం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ వ్యాఖ్యానించారు